చిలకలపూడి (మచిలీపట్నం): ఖాతాదారునికి యూనియన్ బ్యాంక్ పరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ అధ్యక్షుడు నందిపాటి పద్మారెడ్డి, సభ్యురాలు శ్రీలక్ష్మీరాయల గురువారం తీర్పుచెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన తోట గంగరాజుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తుందుర్రు బ్రాంచ్‌లో సేవింగ్ అకౌంట్ ఉంది. 2023 సెప్టెంబరు 26వ తేదీన గంగరాజు డెబిట్‌కార్డు వివరాలు, ఓటీపీ చెప్పమని ఒక కాల్ వచ్చింది. వెంటనే బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలియజేసి అకౌంట్స్, డెబిట్ కార్డు బ్లాక్ చేయించారు. వారం రోజుల తరువాత గంగరాజు కొత్త డెబిట్‌కార్డు తీసుకున్నారు. 2023 అక్టోబరు 5వ తేదీన రూ.1,39,200 గంగరాజు అకౌంట్ నుంచి మూడు విడతలుగా నగదు కట్ అయింది. దీంతో ఆయన యూనియన్ బ్యాంక్ వారిని కలిసి ఏ విధమైన లావాదేవీలు జరగకుండానే నగదు కట్ అయిందని ఫిర్యాదు చేశారు.
అపరిచిత వ్యక్తుల వల్ల నగదు కట్ అయిందని, దానికి బ్యాంకు వారే బాధ్యులని అంటూ ఆయన వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కమిషన్ సభ్యులు పూర్వాపరాలను విచారించి తోట గంగరాజు ఖాతా నుంచి కట్ అయిన నగదు రూ.1,39,200 యూనియన్ బ్యాంకు వారు 9 శాతం వడ్డీతో కట్ అయిన తేదీ నుంచి చెల్లించాలని, మానసిక వేదన కలిగించినందుకు రూ.25 వేలు, ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు తీర్పు వెలువడిన 30 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కుక్కునూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కుక్కునూరు మండలం సీతారామపురం గ్రామానికి చెందిన చనుబల్లి సుబ్బారావు (48) గురువారం తన బైక్‌పై తెలంగాణ రాష్ట్రం అశ్వారా వుపేట నుంచి కుక్కునూరు వస్తూ వినాయకపురం సమీపంలో అదుపు తప్పి బైక్‌పైనుంచి కిందకు పడిపోయాడు. తీవ్రగాయాలు కావడంతో సుబ్బారావుని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.