పాలకొల్లు సెంట్రల్: ద్విచక్ర వాహనాన్ని డెలివరీ చేసేందుకు వెళ్లిన వ్యక్తి లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పాలకొల్లు నరసాపురం రహదారిలో టిడ్కో గృహాల సముదాయం సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెన్నేటి ప్రసాద్ (38) నరసాపురంలోని ఓ ద్విచక్ర వాహనాల షోరూమ్‌లో పనిచేస్తున్నాడు. గురువారం నరసాపురం నుంచి మార్టేరు షోరూమ్‌కు వాహనాన్ని డెలివరీ చేయడానికి వెళుతున్నాడు.
పాలకొల్లు దగ్గర్లో టిడ్కో గృహాల సముదాయం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వస్తున్న కంటైనర్ లారీ ఓవర్‌టేక్ చేసే క్రమంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ప్రసాద్ లారీ వెనుక టైర్ కింద పడడంతో తల నుజ్జయి అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రసాద్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో నివాసం ఉంటున్నారు. ప్రసాద్ ఉద్యోగం నిమిత్తం నరసాపురంలోనే రూము తీసుకుని ఉంటున్నాడు. అతడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పృధ్వీ తెలిపారు.