
డ్రెయిన్‌లోకి దూసుకెళ్లిన కారు
విశ్రాంత సైంటిస్ట్ మృతి
ముదినేపల్లి రూరల్: పోల్‌రాజ్ డ్రెయిన్‌లో కారు దూసుకుపోయిన ఘటనలో విశ్రాంత సైంటిస్టు మరణించిన ఘటన ముదినేపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగింది. మండవల్లి మండలం లింగాలకు చెందిన చందు వెంకటేశ్వరరావు(63) నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఎస్‌ఏ)లో శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఇటీవలే ఉద్యోగ విరమణ చేసి హైదరాబాదులో ఉంటున్నారు. లింగాల గ్రామంలోని బంధువుల ఇంట జరిగే వివాహం నిమిత్తం హైదరాబాదు నుంచి భార్య రాణితో కలసి వస్తున్నారు. పోల్‌రాజ్ వంతెన వద్ద డైవర్షన్ రోడ్డులో ప్రయాణించాల్సి ఉండగా, డైవర్షన్ గమనించకపోవడంతో పోల్‌రాజ్ డ్రెయిన్‌లోకి కారు దూసుకుపోయింది. ప్రమాద సమయంలో పక్కనే చెరువులపై పనిచేసే కూలీలు ప్రమాదాన్ని గమనించి కాల్వలోకి దూకి రాణిని కాపాడారు. అప్పటికే వెంకటేశ్వరరావు మృతిచెందారు. ప్రమాదవార్త తెలిసిన వెంటనే కై కలూరు సీఐ వి.రవికుమార్, స్థానిక ఎస్‌ఐ వీరభద్రరావు సంఘటన స్థలానికి చేరుకుని వెంకటేశ్వరరావు మృతదేహాన్ని బయటకు తీసి, గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాంట్రాక్టర్ డైవర్షన్ బోర్డులు పెట్టకపోవడంతోనే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతుడు వెంకటేశ్వరరావుకు ముగ్గరు కుమార్తెలు కాగా.. వారంతా అమెరికాలో స్థిరపడ్డారు.