
జీఐపై ఉద్యాన వర్సిటీ ఎంఓయూ
తాడేపల్లిగూడెం: భౌగోళిక గుర్తింపు సూచికల ఆవశ్యకత నానాటికి పెరుగుతుందని, ఈ మొక్క మనదే, ఈ వస్తువు భారతదేశానిదే అనే విషయాలు అధికారికంగా గుర్తింపు పొందాలంటే జీఐ సూచికల ప్రాధాన్యత అవసరం ఉందని హైదరాబాద్‌కు చెందిన రిసల్యూట్ 4ఐపీ గ్రూపు వ్యవస్థాపకుడు సుభజిత్‌సాహ అన్నారు. డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో మంగళవారం జీఐ అంశంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. 2030 నాటికి 10వేల జీఐల నమోదు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో జీఐలు పొందటంలో విశ్వవిద్యాలయాల పాత్ర పెరిగిందన్నారు. ఉపకులపతి డాక్టర్ కె.గోపాల్ మాట్లాడుతూ జీఐలు పొందడంలో విశ్వవిద్యాలయాలకు ఆచరణలో ప్రతిబంధకాలు ఉన్నాయని, ఇలాంటి విషయాలపై ఆకళింపు కలిగిన రిసల్యూట్ గ్రూపు అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థతో ఉద్యానవర్సిటీ ఎంఓయూ కుదుర్చుకుందన్నారు. దీని వల్ల యూనివర్సిటీ తయారు చేసిన వంగడాలు వంటి వాటికి జీఐ సులభతరంగా వచ్చే అవకాశం ఉందన్నారు. రీసల్యూట్ సంస్థతో ఒప్పంద పత్రాలను వీసీ గోపాల్, సుభజిత్ సాహ మార్చుకున్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీయల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ డాక్టర్ కె.ధనుంజయ్ రావు పర్యవేక్షించారు. విశ్వవిద్యాలయ అధికారులు ఎం.మాధవి, బి.శ్రీనివాసులు, బి.ప్రసన్నకుమార్, ఎస్.సూర్యకుమారి, తదితరులు పాల్గొన్నారు.