
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
టి.నరసాపురం: ఆయిల్‌పామ్ గెలలు కోస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. టి.నరసాపురంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కె.జగ్గవరం గ్రామానికి చెందిన కొమ్ము రవింద్ర (22) ఆయిల్‌పామ్ గెలలు నరికే పని చేస్తుంటాడు. మంగళవారం మరో వ్యక్తితో కలిసి టి.నరసాపురంలో ఆయిల్‌పామ్ గెలలు నరికే పనికి వెళ్లాడు. గెలలు కోస్తుండగా గెలలు కోసే గెడకు విద్యుత్ షాక్ తగిలి రవీంద్ర కిందకు పడిపోయాడు. స్థానికులు రవీంద్రను చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని ధర్నా
చింతలపూడి ఏరియా హాస్పిటల్‌లో ఉన్న రవింద్ర మృతదేహాన్ని ఆయిల్‌పామ్ గెలలు నరికే కార్మికులు, సీఐటీయూ నాయకులు సందర్శించారు. అనంతరం ఫైర్ స్టేషన్ సెంటర్లో మృతుని కుటుంబీకులతో కలసి ధర్నా నిర్వహించారు. రవీంద్ర కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆందోళనకారులతో చర్చించి ఆందోళన విరమింపజేశారు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి