
మానవ అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో మానవ అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. జులై 30న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమ వారం పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంయుక్తంగా ప్రచార గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి 30 వరకు పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జిల్లాలో పక్షోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. విద్యా శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. తల్లిదండ్రులు పిల్లల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి నడవడికపై పర్యవేక్షణ చేపట్టాలన్నారు. మానవ అక్రమ రవాణా నిరోధానికి అత్యవసర సమయాల్లో 1098, 1800 1027 222 నెంబర్లకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ మొగిలి వెంకటేశ్వర్లు, డీపీఓ ఎ.రామనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు
భీమవరం(ప్రకాశం చౌక్): లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జి.గీతాబాయి హెచ్చరించారు. కలెక్టరేట్ డీఎం అండ్ హెచ్‌ఓ కార్యాలయంలో సోమవారం లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం అమలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో ఈ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు సంబంధిత అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ప్రజల ఫిర్యాదులపై
నిర్లక్ష్యం వద్దు
భీమవరం: ప్రజల పిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు స్వీకరించిన అనంతరం జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులకు పరిష్కరించాలని ఆయన ఆదేశించారు. 14 ఫిర్యాదులు అందగా బాధితుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆర్‌జేసీ విచారణ
పాలకొల్లు సెంట్రల్: క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సమస్యలపై ఫిర్యాదుల నేపథ్యంలో దేవదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ వేండ్ర త్రినాథరావు సోమవారం విచారణ నిర్వహించారు. మూలవిరాట్‌కు దాతల సహకారంతో చేయించిన వెండి మండపంపై మరో దాత ఇచ్చిన ఆరు గ్రాముల బంగారు పతకం ఎలా పెడతారని ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు ప్రశ్నించారు. ఆలయ ప్రధానార్చకులు ముగ్గురూ ప్రతి ఉపాలయం వద్ద సొంతంగా కొందరు బ్రాహ్మణులను పెట్టుకుని పళ్లాలను ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిపారు. ఆలయంలో పళ్లాల సంస్కృతి తొలగించాలని సూచించారు. స్వామివారి కల్యాణం లోపల మండపంలో కాకుండా బయట ఏర్పాటుచేయడం వల్ల భక్తులు తిలకించడానికి వీలుగా ఉంటుందని ఆ విషయంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.

మానవ అక్రమ రవాణా నిరోధానికి పటిష్ట చర్యలు