
పీ4 ఒత్తిడి తగ్గించకుంటే పోరుబాటే
భీమవరం: ఉపాధ్యాయులు పీ4 పేరుతో కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలని దాని కోసం వెంటనే రిజిస్టర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిస్తూ ఒత్తిడి చేయడాన్ని యూటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎస్ విజయరామరాజు, ఎకేవీ రామభద్రం తీవ్రంగా ఖండించారు. సోమవారం భీమవరంలో మాట్లాడుతూ ఉపాధ్యాయులను ఇప్పటికే బోధనేతర పనులతో బోధనకు దూరం చేయడం వల్ల విద్యార్థుల్లో అభ్యసనం మందగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బదిలీలు, ప్రమోషన్లు తరువాత ఎక్కువ శాతం ఉపాధ్యాయులకు జీతాలు అందక ఆందోళనకు గురవుతున్నారన్నారు. సమాజంలో పేదరిక నిర్మూలనకు స్వచ్ఛంద సంస్థలు, ఎన్నారైల ఆసరా కోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందన్నారు. విద్యాశాఖాధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులపై భారాన్ని తగ్గించాలని, లేకుంటే ఆందోళన బాట పట్టాల్సివస్తుందని హెచ్చరించారు.
ఉద్యోగులపై పీ4 భారం దారుణం
ఉద్యోగులపై పీ4 భారాన్ని నెట్టే ఆలోచనను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జెఎన్‌వీ గోపాలన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీ4 పథకానికి కార్పొరేట్లు, సంపన్నుల నుంచి ఆశించిన స్పందన రాకపోవడంతో ఆ భారాన్ని ఉద్యోగులపై నెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ఉపాధ్యాయులంతా ఐదుగురిని దత్తత తీసుకోవాలని విద్యాశాఖాధికారుల ద్వారా ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడం, మరోవైపు ప్రతి సచివాలయ కార్యదర్శి తప్పనిసరిగా ఇద్దరిని దత్తత తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వకుండా వారి హక్కులను హరిస్తూ భారాలు మోపుతూ పీ4 భారాన్ని నెట్టడం దుర్మార్గమని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలు ఎగ్గొట్టిన పన్నులు, బ్యాంకు రుణాలను ప్రభుత్వం వసూలు చేస్తే 20 లక్షల మంది పేదలకు అవసరమైన అన్ని సౌకర్యాలు సులభంగా ఏర్పాటు చేయవచ్చని చెప్పారు.