
పారదర్శకంగా అర్జీలు పరిష్కరించాలి
భీమవరం(ప్రకాశం చౌక్): పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారం పారదర్శకత, నాణ్యతతో ఉండాలని కలెక్టర్ సి.నాగరాణి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ పాల్గొని జిల్లా అధికారులతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీలు తమ పరిధిలోకి రాకపోతే వెంటనే సంబంధిత శాఖకు ఎండార్స్ చేసి పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన అర్జీలు
తల్లికి వందనం ఆర్థిక సాయం అందలేదని అత్తిలికి చెందిన వమ్మి వీర సంధ్య, అల్తి విజయదుర్గ మహేశ్వరి ఫిర్యాదుచేశారు. కంటి చూపు దెబ్బతిందని, పెన్షన్ ఇప్పించాలని కాళ్ల మండలం కోళ్లపర్రు గ్రామానికి చెందిన గండి వెంకన్న అర్జీ పెట్టుకున్నాడు. 22(ఎ) నుంచి తన భూమి తొలగించాలని తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామానికి చెందిన సీహెచ్.సుబ్బలక్ష్మీ, సీహెచ్.బాబురావు, బి.నీరజ కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. గొల్లలకోడేరులో పంచాయతీ భూములను అమ్మేస్తున్నారని, సర్పంచ్, ఉప సర్పంచ్ పంచాయతీకి చెందిన స్థలాలను ఆక్రమించుకుని అమ్ముకుంటారని పాలకోడేరు జెడ్పీటీసీ పెద్దిశెట్టి లక్ష్మీతులసి దంపతులు ఫిర్యాదు చేశారు. – పింఛన్ మంజూరు చేయాలంటూ పోడూరు మండలం పెమ్మరాజు పోలవరానికి చెందిన టి.బసవమ్మ అర్జీ అందజేసింది.