
ఆందోళనతో వెనక్కి తగ్గిన డీఈవో
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో ప్రతి మండలంలో 190 మంది ప్రధానోపాధ్యాయులు/స్కూల్ అసిస్టెంట్లను పీ–4 మార్గదర్శకులుగా తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఈ నెల 25న ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు ఇచ్చిన మరుసటి రోజు సాయంత్రం 5 గంటల లోపు ప్రతి మండలంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. ఈ ఉత్తర్వులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నాయకులు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ విషయంపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో డీఈఓ తన ఉత్తర్వులపై యూ టర్న్ తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఉపాధ్యాయులెవరినీ కూడా పీ4లో గుర్తించిన బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఎలాంటి ఒత్తిడి చేయలేదని తెలిపారు. మార్గదర్శిగా నమోదు స్వచ్చంద కార్యక్రమమని ఆ ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులకు బోధనేతర విధులను అప్పగించే విషయంలో జిల్లా కలెక్టర్ కూడా వ్యతిరేకమన్నారు. డీఈఓ యూటర్న్ తీసుకోవడంతో ఉపాధ్యాయ సంఘాల జేఏసీ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాన్ని తాత్కాలికంగా విరమించుకున్నారు.