
అభివృద్ధి ముసుగులో మట్టి దందా
ద్వారకాతిరుమల: కొందరు పచ్చనేతలు మట్టినే వ్యాపారంగా ఎంచుకున్నారు. చెరువులు, కాలువ గట్లకు తూట్లు పొడుస్తూ యథేచ్ఛగా మట్టి దందాను సాగిస్తున్నారు. ట్రాక్టర్‌కు, టిప్పర్‌కు ఇంత రేటని ఫిక్స్‌చేసి, అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ద్వారకాతిరుమల మండలం తక్కెళ్లపాడులోని లక్ష్మీపురం చెరువులో గత నెల రోజులుగా ఈ మట్టి వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. లక్ష్మీపురం చెరువు సుమారు 57 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పి.కన్నాపురంలోని ఓ ప్రైవేటు పరిశ్రమ ఈ చెరువును అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చింది. గత నెలరోజుల క్రితం నుంచి రెండు పొక్లెయిన్‌లతో మట్టి తవ్వకాలను జోరుగా సాగిస్తోంది. వర్షాల కారణంగా మూడు రోజులపాటు నిలిచిపోయిన ఈ పనులు తిరిగి ఆదివారం ప్రారంభమయ్యాయి. వాస్తవానికి తవ్విన మట్టితో చెరువుకు గట్లు వేయాల్సి ఉంది. కొందరు టీడీపీ నేతలు ఆ మట్టిని అమ్ముకుని, వచ్చిన సొమ్ములతో జేబులు నింపుకుంటున్నారు. వీరిని చూస్తున్న ప్రజలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఇందుకా.. అని ముక్కున వేలేసుకుంటున్నారు.
లోకల్‌కు ఓ రేటు.. నాన్ లోకల్‌కు ఓ రేటు
తక్కెళ్లపాడు పంచాయతీకి చెందిన ట్రాక్టర్‌కు రూ. 200కు, పక్క పంచాయితీలకు చెందిన ట్రాక్టర్‌కు రూ.1,000కు మట్టిని విక్రయిస్తున్నారు. టిప్పర్‌కు రూ. 3,500కు మట్టిని అమ్ముతున్నారు. చెరువులోకి వచ్చే ట్రాక్టర్, టిప్పర్‌ల యజమానుల నుంచి ఈ సొమ్ములను టీడీపీ నేతలు వసూలు చేసి, జేబులో వేసుకుంటున్నారు. ట్రాక్టర్, టిప్పర్ల యజమానులు ఆ మట్టిని తీసుకెళ్లి తమకు నచ్చిన రేటుకు అమ్ముకుంటున్నారు. బహిరంగంగా ఇంత జరుగుతుంటే అధికారులు తమకేమీ తెలియనట్టు నిద్ర నటిస్తున్నారు. కాసులు అందుకుని నిమ్మకుండిపోయారో.. లేక నేతల బెదిరింపులకు లొంగిపోయారో తెలియడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పక్కదారి పడుతున్న ప్రజాధనాన్ని ప్రభుత్వానికి జమ చేయాలని పలువురు కోరుతున్నారు.
తక్కెళ్లపాడులోని లక్ష్మీపురం చెరువులో మట్టి తవ్వకాలు
జోరుగా సాగుతున్న పచ్చనేతల మట్టి వ్యాపారం