
పరీక్షా కేంద్రం మార్పుతో గందరగోళం
పెనుగొండ: ఎయిడెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థుల భవిష్యత్తుతో విద్యా శాఖ ఆడుకుంటోంది. ఆదివారం నిర్వహించిన అర్హత పరీక్షలో గందరగోళం నెలకొంది. పెనుగొండ సెంటర్‌కు వచ్చిన తరువాత సెంటరు మార్పు చేయడంతో పెనుగొండ కళాశాల గేటు వద్ద అభ్యర్థులు నిరసన వ్యక్తం చేశారు. సమన్వయ లోపంతో సుమారు 50 మంది అఽభ్యర్థులు పరీక్షకు దూరమయ్యారు. పెనుగొండలోని ఎస్వీ కేపీ అండ్ కోట్ల వెంకట్రామయ్య బాలికోన్నత పాఠశాలలో మూడు సంవత్సరాల కాంట్రాక్టు ఉపాధ్యాయులకు నోటిపికేషన్ విడుదల చేశారు. మొత్తం 7 పోస్టులకు 1400 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో 912 మందిని అర్హులుగా గుర్తించారు. వారికి టెస్ట్ నిర్వహించడానికి ఈ నెల 15న జిల్లా విద్యాశాఖాధికారి పెనుగొండలోని ఎస్వీకేపీ అండ్ డాక్టర్ కేఎస్ రాజు కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా పాఠశాల నుంచి అర్హులైన వారికి హాల్ టికెట్లు జారీ చేశారు. అకస్మాత్తుగా పరీక్షా కేంద్రాలను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, డీఎన్‌ఆర్ కళాశాలలో రెండు సెంటర్లు, తాడేపల్లిగూడెంలోని వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలో, శశి ఇంజనీరింగ్ కళాశాలకు మార్పు చేశారు. ఈ సమాచారం కొంతమందికి మాత్రమే అందింది. ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ద్వారా దరఖాస్తు చేసుకొన్న వారికి ఎలాంటి సమాచారం లేకుండా పోయింది.
పెనుగొండలోని ఎయిడెడ్ పాఠశాలకు ఎలాంటి సమాచారం లేదు. అభ్యర్థులలో కొందరు మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడంతో మూడు స్లాట్లలో పరీక్షలు ఏర్పాటు చేశారు. అయితే, పరీక్షా సమయం కావస్తున్నా విద్యాశాఖాధికారులు రాకపోవడంతో అనుమానం వచ్చి సంప్రదిస్తే పరీక్షా కేంద్రం మార్పు చేశారని చెప్పారు. అప్పటికే కేంద్రానికి 50 మందికి పైగా అభ్యర్ధులు చేరుకున్నారు. ఎలాంటి సమాచారం అందించకుండా మార్పు ఎలా చేశారంటూ నిరశన వ్యక్తం చేశారు. విద్యాశాఖాధికారులు పోస్టులను బేరం పెట్టారని, అందుకే పరీక్ష నిర్వహణలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు.