
కువైట్‌లో నా భార్యను నిర్బంధించారు..
కొయ్యలగూడెం: కువైట్‌లో చిక్కుకుపోయిన తన భార్యను రక్షించాలని బయ్యనగూడెం గ్రామానికి చెందిన మర్రిపూడి వెంకటరమణ కోరుతున్నాడు. వెంకటరమణ భార్య సుమ ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితం కువైట్ వెళ్ళింది. వెంకటరమణ వెన్నెముక దెబ్బ తినడంతో కుటుంబ పోషణ నిమిత్తం సుమ కువైట్‌లోని క్లీనింగ్ పనులకు చేరింది. రెండు నెలల నుంచి తీవ్ర అనారోగ్యంతో ఆమె బాధపడుతోంది. దీంతో సుమను కువైట్‌కి పంపిన భీమవరంలోని ఏజెంట్‌ను సంప్రదించగా రూ.1.50 లక్షలు కడితే సుమను ఇండియాకి తీసుకువస్తానని చెప్పాడు. తన భార్య వద్ద ఫోన్‌ను తీసుకుని మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని, వేరొకరి ఫోన్ నుంచి సమాచారం అందజేసిందన్నారు. ప్రభుత్వం తన భార్యను క్షేమంగా ఇండియాకు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని రమణ కోరుతున్నాడు.
పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి
కాళ్ల: రాష్ట్రంలో గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని రాష్ట్ర సర్పంచుల సంఘ ఉపాధ్యక్షుడు కొలుకులూరి ధర్మరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గత 8 నెలల కాలంగా కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేసిన రూ.1,120 కోట్ల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాంపు డ్యూటీలో పంచాయతీల వాటాను గతంలో 3 నెలలకోసారి విడుదల చేసేవారని గుర్తు చేశారు. గత ఏడాదిగా ప్రభుత్వం ఆ సొమ్మును సొంత అవసరాలకు వాడుకోవడం చాలా దారుణమన్నారు. పంచాయతీలను ఉద్ధరిస్తానని వాగ్దానం చేసిన పంచాయతీ రాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ సినిమాల బిజీలో పడి మమ్మల్ని మరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.