
వివాహిత ఆత్మహత్య
కొయ్యలగూడెం: క్షణికావేశంలో ఉరివేసుకుని వివాహిత ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. సర్పంచ్ కడకట్ల గడ్డియ్య తెలిపిన వివరాల ప్రకారం.. కొయ్యలగూడెం మండలం బోడిగూడెం గ్రామానికి చెందిన ఆవూరి అంజలి(18)కి అదే గ్రామానికి చెందిన ఆవూరి వెంకట కల్యాణ్‌తో ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అంజలికి తల్లిదండ్రులు లేకపోవడంతో పెద్దమ్మ దగ్గర ఉంటూ చదువుకునేది. అదే గ్రామానికి చెందిన కల్యాణ్ అంజలిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇటీవల అంజలికి, కల్యాణ్‌కు మనస్పర్ధలు రావడంతో పెద్దల సమక్షంలో పరిష్కరించారు. ఆషాఢ మాసం కావడంతో అంజలి పెద్దమ్మ ఇంటికి వచ్చింది. ఆషాఢం పూర్తయిన సందర్భంగా భార్యను తీసుకు వెళ్ళమని కళ్యాణ్‌కు అంజలి పుట్టింటి వారు కబురు పంపగా మీరే తీసుకువచ్చి దింపాలన్నాడు. దీంతో మనస్థాపానికి గురైన అంజలి ఇంటి వద్ద ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని మృతి చెందిందని తెలిపారు. పోలవరం సీఐ బాల సురేష్‌బాబు, ఎస్సై చంద్రశేఖర్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
మండవల్లి: కుటుంబ సభ్యులతో మాట మాట పెరిగి మనస్తాపంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అయ్యవారిరుద్రవరంలో ఆదివారం జరిగింది. మండలంలోని అయ్యవారిరుద్రవరానికి చెందిన రంగమ్మ(45) భర్త పిల్లలతో కలిసి జీవిస్తుంది. కుటుంబ సభ్యులు ఆమెను కూలి పనులకు వెళ్ళవద్దని ఇంటివద్దనే ఉండమని చెప్పారు. దీంతో రంగమ్మ మనస్తాపంతె పందికొక్కుల టాబ్లెట్లు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివాహిత ఆత్మహత్య