
నాలుగు ఆలయాల్లో చోరీ
నిడమర్రు: మండలంలోని నాలుగు ఆలయాల్లో డిబ్బీల్లో నగదు చోరీకి గురైంది. నిడమర్రు ఎస్సై వీర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం అర్ధరాత్రి పత్తేపురంలో మూడు దేవాలయాల్లో, పెదనిండ్రకొలను గ్రామంలోని ఒక దేవాలయంలోని డిబ్బీలు పగలు గొట్టి నగదు దోచుకున్నట్లు తెలిపారు. ఈ నాలుగు దేవాలయాలను స్థానిక ఆలయ కమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. పత్తేపురంలో పత్తేపురం– పెదనిండ్రకొలను ఆర్‌అండ్‌బీ రోడ్డు మార్గంలోని శ్రీకృష్ణుడి ఆలయం, గ్రామ ప్రధాన మంచినీటి చెరువు వద్ద నిర్మించిన శ్రీ అంజనేయ విగ్రహ ఆలయం, వినాయక స్వామి ఆలయం, పెదనిండ్రకొలను గ్రామంలోని తూర్పుపేట వినాయకుడి గుడి వద్ద ఉన్న డిబ్బీల్లోని నగదు చోరీకి గురైంది. కమిటీల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాలకు వెళ్లి పరిశీలించి కేసు నమోదు కేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వీర ప్రసాద్ తెలిపారు. అందుబాటులో ఉన్న సీసీ పుటేజ్ పరిశీలనలో శనివారం అర్ధరాత్రి దాటాక 25 నుంచి 30 సంవత్సరాలన్న ముగ్గురు యువకులు పల్సర్ బైక్ పై వచ్చి ఈ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.