
పారిజాతగిరిలో మార్మోగిన గోవింద నామస్మరణ
జంగారెడ్డిగూడెం: భక్తుల గోవింద నామ స్మరణలతో గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వరస్వామి క్షేత్రం పులకించింది. దేవస్థానంలో పారిజాత గిరి కొండ చుట్టూ నిర్మించిన ప్రదక్షిణ మార్గాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి విశేష భక్త జన సందోహం మధ్య శనివారం ప్రారంభించారు. భక్తులు పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించారు. ప్రధానార్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఏర్పాట్లను అభివృద్ధి కమిటీ సహకారంతో ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, గిరి ప్రదక్షణ మార్గానికి ఆర్థిక సహకారం అందజేసిన మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథరావు, పార్టీ మండల, పట్టణ నాయకులు, కార్యకర్తలు గిరిప్రదక్షిణ చేశారు.
ఆలయ గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభం