
భవన నిర్మాణ కార్మికుల పోరుబాట
భీమవరం: పనులు లేక అవస్థలు పడుతున్న భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ పోరుబాట పట్టారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది గడిచినా కార్మికులకు చేతినిండా పనులు దొరకని దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కార్మిక, ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నాయి. వీరికి తోడు భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ఉద్యమబాట పట్టారు. దీనిలో భాగంగా ఇప్పటికే భవన నిర్మాణ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద ఆందోళనలు నిర్వహించి వినతిపత్రాలు అందచేశారు.
నమోదు సులభతరం చేయాలి
భవన నిర్మాణ కార్మికులకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి బోర్డులో కార్మికుల నమోదు ప్రక్రియను సులభతరం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఏర్పాటు చేసిన వెల్పేర్ బోర్డు ద్వారా నిర్మాణదారుల నుంచి ఒక శాతం సెస్ వసూలు చేసి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వినియోగించగా నేటి ప్రభుత్వం సెస్ నిధులను దారి మళ్లించి కార్మికులకు మొండిచేయి చూపుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులుండగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో సుమారు 1.70 లక్షల మంది కార్మికులు వెల్పేర్ బోర్డులో నమోదు చేసుకున్నారు.
హామీని ఎప్పుడు అమలు చేస్తారు?
ఎన్నికల సమయంలో భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డును అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా భవన నిర్మాణ కార్మికులను పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కార్మికుల నమోదు వంటి ప్రక్రియను సులభతరం చేసి వార్డు, గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులకు ఐదురోజులు ఆసుపత్రిలో ఉండాలనే నిబంధనను, తొలగించాలని ప్రమాదం కారణంగా విశాంత్రి తీసుకుంటున్న కాార్మికులకు ఇచ్చే రూ.100 భృతిని రూ.500 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదాలు, ఆనారోగ్యం కారణంగా మంచాన పడిన కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ద్వారా ఈఎస్‌ఐ తరహాలో ఉచిత వైద్య సాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే పోరుబాట తప్పదని హెచ్చరిస్తున్నారు.
వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని ఆందోళనలు
ప్రభుత్వం స్పందించకుంటే ఉధృతం చేస్తామని హెచ్చరిక