
న్యాయం చేయకపోతే పోరు ఉధృతం
జంగారెడ్డిగూడెం: గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతులకు న్యాయం చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ఆగస్టు 4న గ్రీన్‌ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల చలో కలెక్టరేట్ నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని మానవతా కల్యాణ మండపంలో నిర్వాసిత రైతుల సదస్సు నిర్వహించారు. సదస్సుకు వామిశెట్టి హరిబాబు అధ్యక్షత వహించారు. రైతుల సమస్యలు చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఆగస్టు చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని సదస్సులో ఏకగ్రీవంగా తీర్మానించారు. కె.శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్వాసిత రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరలేదని, రైతులను మోసగించారని తీవ్రంగా విమర్శించారు. సర్వీస్ రోడ్ల నిర్మాణం చేయకపోవడం వల్ల పొలాలకు వెళ్లే మార్గాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆర్బిట్రేషన్ పిటిషన్ల ద్వారా పరిహారం పెంచి ఇస్తామని హామీ ఇచ్చి కొద్దిమందికి కొద్ది పరిహారం పెంచి మిగిలిన రైతులకు అన్యాయం చేయడం తగదన్నారు. చింతలపూడి, టి.నర్సాపురం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి తదితర మండలాల్లో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వల్ల తలెత్తిని సమస్యలు పరిష్కారం చేయాలన్నారు. సదస్సులో రైతుల పోరాట కమిటీ నాయకులు వామిశెట్టి హరిబాబు, అల్లూరి రామకృష్ణ, దేవరపల్లి సత్యనారాయణ, శీలం రామచంద్రరావు, ఎలికే తాతారావు, వందనపు సాయిబాబా, కె.నాగేశ్వరావు, కె.రంగారావు, జి.నర్సిరెడ్డి, బొడ్డు రాంబాబు, పి.శ్రీహరి తదితరులు మాట్లాడుతూ సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల గ్రామాల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరిహారంతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సదస్సుకు ముందుగా గురవాయిగూడెంలో రైతులు ధర్నా చేపట్టారు.
గ్రీన్‌ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల తీర్మానం