
కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు బ్యాంకర్లు విరివిగా రుణాలు అందించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో బ్యాంకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకాల లక్ష్యసాధనకు బ్యాంకర్లు తమవంతు సహకారం అందిచాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్‌హెచ్‌జీలకు రుణాల మంజూరు లక్ష్యంలో చాలా లోటు కనిపిస్తుందని, మైక్రో క్రెడిట్ ప్లాన్ అందిన వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.977.74 కోట్ల రుణాల మంజూరు లక్ష్యంగా కాగా.. కేవలం రూ.144.85 కోట్లు మాత్రమే మంజూరు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఆర్‌డీఎ ద్వారా పంపిన 9,633 ఎంసీపీలకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. చేనేత కార్మికులకు ముద్ర లోన్ మంజూరులో తీవ్ర జాప్యం ఎందుకని ప్రశ్నించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎల్.వి.వి.ఆర్.కె.ఎం.ఎస్ మన్యం మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం అమలు లక్ష్యానికి కృషి చేయాలని సూచించారు. నాబార్డ్ ప్రతినిధి నిష్యంత్ చంద్ర, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎ.నాగేంద్ర ప్రసాద్, ఆర్బీఐ ప్రతినిధి రామకృష్ణ పాల్గొన్నారు.
అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి
భీమవరం అర్భన్: సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరు అక్షర జ్ఞానం కలిగి ఉండాలని, జిల్లాలోని నిరక్షరాస్యలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. మంగళవారం వయోజన విద్యా శాఖ ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి ‘అక్షర ఆంధ్ర’ అక్షరాస్యత 2025–26పై శిక్షణా తరగతుల ప్రారంభ సభలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 2029 నాటికి నిరక్షరాస్యులు లేని జిల్లాగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచేందుకు అధికారులు నిరంతరాయంగా కృషి చేయాలన్నారు.