
ఆత్మీయ కలయిక
భీమవరం: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆ పార్టీ నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త ముదు నూరి మురళీకృష్ణంరాజు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలో నిర్వహించిన పార్టీ పీఏసీ సమావేశానికి హాజరైన సందర్భంగా ఆయన పార్టీ అధినేతను కలిశారు.
పీ4లో భాగస్వాములవ్వాలి
భీమవరం (ప్రకాశంచౌక్): పీ4లో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లాలోని సంపన్న రైతులు, ఎరువులు, పురుగు మందుల షాపుల యజమానులు, డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని పేద వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించిందని, కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి చేయూతనిస్తే వారు ఆర్థికంగా ఎదుగుతారన్నారు.
దోపిడీ కోసమే స్మార్ట్ మీటర్లు
ఏలూరు (టూటౌన్): దోపిడీ కోసమే స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని కార్మిక సంఘాల ఐక్య కార్యచరణ నాయకులు విమర్శించారు. కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ ఆధ్వర్యంలో మంగళవారం వన్ టౌన్ బిర్లాభవన్ సెంటర్ నుంచి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఐఎఫ్‌టియు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, సీఐటీయూ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్‌వీడి ప్రసాదు, రైతు సంఘం రాష్ట కార్యదర్శి డేగ ప్రభాకర్ మాట్లా డుతూ కుటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కనపెట్టి అదానీ కంపెనీకి సేవకులుగా పని చేస్తున్నారని విమర్శించారు. ప్రజల డబ్బులను ఏ విధంగా దోచుకోవాలో, ఆ డబ్బులు కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేలా బాబు సర్కార్ వేగంగా పనిచేస్తుందని ఎద్దేవా చేశారు.
పోలవరం నుంచి భారీగా నీటి విడుదల
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పోలవవరానికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తెలంగాణ, మహారాష్ట్రల్లో కురిసిన వర్షాలకు గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహించడంతో గోదావరిలో వరద పోటెత్తుతోంది. గత నాలుగు రోజుల నుంచి రోజుకు సగటున 5 లక్షల క్యూసెక్కుల నీరు పోలవరం నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయానికి పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నీటిమట్టం 31.050 మీటర్లుండగా దిగువకు 6,70,335 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
స్వర్ణకార సంఘ కార్యవర్గం ఎన్నిక
ఆకివీడు: ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లా స్వర్ణకార సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ చైర్మన్ పట్నాల శేషగిరిరావు మంగళవారం చెప్పారు. ఆరోసారి తమను ఎన్నుకోవడంతో డబుల్ హ్యాట్రిక్ సాధించామన్నారు. 25 ఏళ్లపాటు ఒక సంఘం ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇదే ప్రథమమన్నారు. స్వర్ణకారులకు, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులకు సంఘం తరుఫున చేసిన సేవల్ని గుర్తించి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. అధ్యక్షుడిగా తనతో పాటు ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ వెంకట రామకృష్ణ, కోశాధికారిగా కొమ్మోజు రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు కొనసాగుతారని చెప్పారు.

ఆత్మీయ కలయిక