
సీతారామస్వామి ఆలయ భూమి స్వాధీనం
జంగారెడ్డిగూడెం: ఎన్నో ఏళ్లుగా కోర్టు వివాదంలో ఉండి ఆక్రమణలో ఉన్న దేవదాయ శాఖ భూమిని శుక్రవారం ఆ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం స్థానిక బుట్టాయగూడెం రోడ్డులోని సీతారామస్వామి ఆలయానికి పట్టణంలోని సుబ్బంపేటలో121/3 సర్వే నెంబర్‌లో 33.65 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో పామాయిల్ తోట ఉంది. అయితే ఈ తోటను చాలా ఏళ్ల క్రితం కొందరు వ్యక్తులు లీజుకు తీసుకుని సేద్యం చేసేవారు. ఆ తరువాత 2002లో ఈ భూమికి లీజుదారులకు రెవెన్యూ శాఖ పట్టాదారుపాస్ పుస్తకం జారీ చేసింది. దీంతో వివాదం మొదలైంది. అప్పటి నుంచి దేవాదాయ శాఖ కోర్టులో పోరాటం చేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల కోర్టు దేవదాయ శాఖకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కూచిపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ ఈఓ కలగర శ్రీనివాస్, దేవాదాయ శాఖ అధికారులు సుబ్బంపేటలోని భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పామాయిల్ తోట ముదురు తోట అని, ఇక కాపు కాయదని ఉద్యానశాఖ లేఖ ఇవ్వడంతో పామాయిల్ మొక్కలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 5 జేసీబీలను పెట్టి పామాయిల్ మొక్కలను తొలగించారు. ఈ భూమిని చదును చేసి లీజుకు వేలం నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు.