
మూడు గంటల్లోనే మిస్సింగ్ కేసు ఛేదన
తాడేపల్లిగూడెం : అదృశ్యమైన బాలుడిని పెంటపాడు పోలీసులు మూడు గంటల్లో సురక్షితంగా వారి తల్లిదండ్రులకు అప్పగించారు. తాడేపల్లిగూడెం రూరల్ ఇన్‌చార్జి సీఐ బోణం ఆదిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం పెంటపాడు మండలం రాచర్ల గ్రామానికి చెందిన ఈదరాడ కామేశ్వరరావు అనే వ్యక్తి తన చెల్లెలు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడానికి గురువారం అర్ధరాత్రి 2.30 సమయంలో ఆయన తల్లి, ఇద్దరు మేనళ్లులతో కలిసి పెంటపాడు పోలీసు స్టేషన్‌కు వచ్చారు. పోలీసు స్టేషన్ పక్కనే ఉన్న రోడ్డులో కారు పార్కు చేసి, అందులో నాలుగు సంవత్సరాల మేనల్లుడిని నిద్రపుచ్చి కారును లాక్ చేసి, మిగిలిన వారు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఫిర్యాదు అనంతరం తిరిగి కారు వద్దకు రాగా, కారులో బాలుడు కనిపించలేదు. వెంటనే వారు తిరిగి స్టేషన్‌కు వెళ్లి మళ్లీ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పెంటపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. తాడేపల్లిగూడెం రూరల్ సర్కిల్ ఇన్‌చార్జి సీఐ బోణం ఆదిప్రసాద్ ఆధ్వర్యంలో పెంటపాడు ఎస్సై కేసీహెచ్ స్వామి తన సిబ్బందితో ప్రత్యేక టీమ్‌గా ఏర్పడ్డారు. సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా గాలింపులు జరిపారు. మూడు గంటల వ్యవధిలో బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.