
ఏబీపై వైఎస్సార్‌సీపీ నేత ధ్వజం
నూజివీడు: వైఎస్సార్‌సీపీ గూండాలు ఇక్కడ ఎవరూ లేరని, ఏమి అరాచకం చే శారో చెప్పాలని, ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడటం మీ స్థాయికి తగదని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ కలగర వెంకటేశ్వరరావు రిటైర్డ్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై మండిపడ్డారు. నూజివీడు మండలం ముక్కొల్లుపాడులో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ 2014–19 కాలంలో టీడీపీ ప్రభుత్వంలో ఏబీ వెంకటేశ్వరరావు తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని, దీంతో గ్రామం బాగుపడుతుందనుకుంటే కేవలం రెండు సిమెంట్ రోడ్లు వేయించారని చెప్పారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిధులను మాత్రం ఆయన అనుచరులు అధికారులను బెదిరించి బిల్లులు చేయించుకుని మెక్కేశారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాన్ని బాగుచేయడానికి కృషి చేశామే గానీ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ వాళ్లను గూండాలంటావా.. దమ్ముంటే పంచాయతీ ఎన్నికల్లో నిలబడు.. నీపై నేనే నిలబడతా.. గెలిచి చూపించు.. అని కలగర వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు. గత ఏడాది కాలంగా గ్రామానికి వస్తే చాలు కేసులు కట్టమంటూ పోలీసు అధికారులపై ఒత్తిడి చేస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. రాష్ట్రస్థాయి అధికారిగా పనిచేసిన ఆయన ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. 56 ఏళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, అప్పటి నుంచి పంచాయతీని గెలిపించుకుంటూనే ఉన్నానని, ఏనాడూ తాను ఎవరిపైనా దౌర్జన్యం చేయలేదని, గ్రామానికి వచ్చి విచారణ చేసుకోవాలని సూచించారు. గ్రామంలో ఒకరిద్దరు చెప్పే మాటలు నమ్మి తప్పుడు మాటలు మాట్లాడటం మంచిది కాదన్నారు. అయినా రాజకీయాల్లో ఎవరిష్టం వచ్చినట్టు వారు ఒకసారి కాకపోతే పదిసార్లు పార్టీలు మారతారని, దీనికి మీకొచ్చే నష్టమేమిటని కలగర ప్రశ్నించారు.