
అక్రమ ఇసుక గుట్టలను సీజ్ చేయాలి
పెనుగొండ: ఆచంట నియోజకవర్గంలో అక్రమ ఇసుక గుట్టలను సీజ్ చేయాలని, మాఫియా ఇసుకను తోడేసి విక్రయిస్తుందంటూ సర్పంచ్‌లు గళమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వుతూ గుట్టలుగా నిల్వ చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలంటూ ఆచంట డిప్యూటీ తహాసీల్దార్ సోమేశ్వరరావుకు గురువారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లు సుంకర సీతారామ్, ఇళ్ల లక్ష్మీ చంద్రిక, జక్కంశెట్టి శ్రీరామ్, కోట సరోజినీ వెంకటశ్వరరావు, గణేషుల శేషవేణి సుబ్బారావు, గుబ్బల ఉషారాణి వీర బ్రహ్మంలు మాట్లాడుతూ టీడీపీ నాయకుడు గణపతినీడి రాంబాబు మాఫియా డాన్‌లా వ్యవహరిస్తూ అక్రమంగా ఇసుక నిల్వ చేస్తున్నారన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ పరిధిలో 50 కిలోమీటర్లు వరకు ఇసుక తీసుకూడదనే నిబంధనలను పట్టించుకోవడం లేదన్నారు. కోడేరు, భీమలాపురం, కరుగోరుమిల్లి, సిద్ధాంతం, నడిపూడిల్లో ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు లేకున్నా వందలాది యంత్రాలతో కోట్లాది రూపాయల ఇసుకను తవ్వేస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గాల్లో ఖాళీ ప్రదేశాలు ఇసుక గుట్టలుగా మారాయన్నారు. రాంబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేశారు. అలాగే ఇసుకను అక్రమంగా తవ్వి కొడమంచిలి, సిద్ధాంతంలోని ప్రభు త్వ ఇసుక స్టాక్ పాయింట్లలోనూ నిల్వ చేశారన్నా రు. గెద్దాడ ఏకలవ్య, మెడిచర్ల పండు, గొట్టుముక్కల సునీల్ తదితరులు పాల్గొన్నారు.