
‘రాజు గాని సవాల్’ చిత్ర బృందం సందడి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రాజు గాని సవాల్ చిత్రబృందం బుధవారం ఏలూరులో సందడి చేసింది. స్థానిక సత్యనారాయణ థియేటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కథానాయకుడు లెలిజాల రవీందర్ మాట్లాడారు. తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. ఆగస్టు 8న విడుదల కానుందని తెలిపారు. హీరోయిన్ రితిక చక్రవర్తి మాట్లాడుతూ తాను ఇప్పటివరకు తమిళ చిత్రాల్లో నటించగా తెలుగులో తనకి ఇది మూడో చిత్రమన్నారు. డిస్ట్రిబ్యూటర్ బాపిరాజు పాల్గొన్నారు.
యువకుడిపై పోక్సో కేసు
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బాలికపై లైంగిక దాడికి యత్నించిన భానుతేజ అనే యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున భీమవరం బేతనిపేటకు చెందిన బాలిక గదిలోకి భానుతేజ చొరబడి ఆమైపె లైంగిక దాడికి యత్నించగా బాలిక కేకలు వేయడంతో పారిపోయాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
బావ, బావమరిదులకు తీవ్ర గాయాలు
భీమడోలు: జాతీయ రహదారి సూరప్పగూడెం ఫ్లై ఓవర్ వంతెన వద్ద బుధవారం ఓ లారీ బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ద్వారకాతిరుమల మండలం తిరుమలంపాలెంకు చెందిన ముదరబోయిన కొండయ్య, తాడిశెట్టి రామకృష్ణ బావ, బావమరుదులు. వీరు బుధవారం కుటుంబ పనుల నిమిత్తం బైక్‌పై విజయవాడ వెళ్తున్నారు. సూరప్పగూడెం ఫ్లైఓవర్ వంతెనపై వెళ్తూ రాంగ్ రూట్‌లో డివైడర్ దాటుతుండగా ఏలూరు నుంచి రాజమండ్రి వైపు వస్తున్న లారీ ఆ బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బావమరుదులూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొండయ్య పరిస్థితి విషమంగా ఉంది. భీమడోలు ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.