
ఆస్తి కోసం భార్యను చంపిన భర్త అరెస్టు
కై కలూరు, ఏలూరు టౌన్ : చేపల చెరువు అమ్మకానికి భార్య అడ్డుపడుతోందని కక్ష పెంచుకుని కత్తితో అతి కిరాతకంగా హత్య చేసిన భర్తను కలిదిండి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసు వివరాలను కలిదిండి పోలీసు స్టేషన్‌లో ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, సీఐ వి.రవికుమార్ వెల్లడించారు. కలిదిండి మండలం ఎస్‌ఆర్‌పీ అగ్రహారం శివారు కట్టావానిపాలెంకు చెందిన కట్టా పెద్దిరాజు(48), జయలక్ష్మి (44) భార్యభర్తలు. వీరికి ఇరువురు మగ సంతానం. గ్రామంలో 33 సెంట్లు చేపల చెరువును విక్రయించి వివాహం జరిగిన పెద్ద కుమారుడికి నగదు ఇవ్వాలని భార్య జయలక్ష్మి భావించింది. ఈ విషయమై ఇద్దరి మద్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం పెద్దిరాజు భీమవరంలో వైద్యం చేయించుకుని వస్తూ కాళ్ల మండలం, దొడ్డనపూడి గ్రామంలో కత్తిని కొనుగోలు చేసి ఇంటిలో దాచాడు. చెరువు విక్రయం విషయంలో ఈ నెల 9న రాత్రి భోజనం చేసిన తర్వాత భార్యభర్తలు గొడవపడ్డారు. ముందుగా తెచ్చుకున్న కత్తితో 10వ తేదీ తెల్లవారుజామున భార్యను విచక్షణ రహితంగా నరికి చంపాడు. తనపై దాడి జరుగుతుందని భావించి పురుగుమందు తాగి, చాకుతో పీకపై కోసుకుని ఆపై ఉరివేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అతడిని 108 వాహనంలో ఏలూరు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కుమారుడు రాము ఫిర్యాదుపై కోలుకొని వచ్చిన తర్వాత పెద్దిరాజును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో కలిదిండి ఎస్సై వి.వెంకటేశ్వరరావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.