
విద్యుత్ మీటరు బిగింపుతో సమస్య పరిష్కారం
యలమంచిలి: కనకాయలంక పంచాయతీ డొల్లవారిపేటకి చెందిన డొల్ల విజయలక్ష్మి ఇంటికి బుధవారం విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ మీటర్ బిగించారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల ఒత్తిడితో పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారులు నాలుగు రోజుల క్రితం ఆ మీటరు తొలగించారు. దీంతో గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ, జనసేన నాయకులు ఆందోళన చేశారు. ఈ క్రమంలో మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ బుధవారం కనకాయలంక వెళ్లి పంచాయతీ కార్యదర్శి అనుమతితో విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసినా కనీసం నోటీస్ ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులు వైఖరి మార్చుకొని ఎక్కడైతే మీటర్ తొలగించారో అదే స్థానంలో మీటర్ ఏర్పాటు చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. దీంతో విద్యుత్ శాఖ లైన్ ఇన్‌స్పెక్టర్ వెంకటరమణ వెంటనే మీటరు బిగించడంతో సమస్య పరిష్కారమైంది. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షుడు నేతల సాల్మన్ రాజు, గ్రామస్తులు పినిపే పెద్దిరాజు, గూటం వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, సరేళ్ళ రాజు, గుడిసె శ్రీను, పైడి వెంకటేష్, సరేళ్ళ తేజ, పినిపే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.