
తాగునీటి కోసం బిందెలతో నిరసన
పెనుగొండ: దళిత వాడలో తాగునీటి పట్ల వివక్ష చూపుతున్నారంటూ ఆచంట వేమవరం శివారు పడమటి పాలెంలో మహిళలు బిందెలతో నిరసన తెలిపారు. మంగళవారం ఉదయం కుళాయి వద్ద బిందెలతో ఆందోళన చేశారు. వీరికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నన్నేటి పుష్పరాజ్ మద్దతు పలికారు. దళిత వాడపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల్లో తాగునీటిని అందిస్తూ దళిత వాడకు అందించడం లేదన్నారు. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా గ్రామ కార్యదర్శి ఇంతవరకూ పరిష్కరించలేదన్నారు. డ్రెయినేజీలు ఏర్పాటు చేయడంలేదన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే మాల మహానాడు ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పిల్లి స్వరూప రాణీ, తరపట్ల గంగారత్నం, సాక జ్యోతి తదితరులు పాల్గొన్నారు.