కోటిపల్లి రైల్వేలైన్‌ నిర్మాణంలో కదలిక | - | Sakshi
Sakshi News home page

కోటిపల్లి రైల్వేలైన్‌ నిర్మాణంలో కదలిక

Jul 23 2025 5:33 AM | Updated on Jul 23 2025 5:33 AM

కోటిప

కోటిపల్లి రైల్వేలైన్‌ నిర్మాణంలో కదలిక

నరసాపురం: నరసాపురం–కోటిపల్లి రైల్వేలైన్‌ నిర్మాణంలో మళ్లీ కాస్త కదిలిక వచ్చింది. ఈ భారీ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సంబందించి ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న స్థల సేకరణ విషయంలో రైల్వేశాఖ ముందడుగు వేస్తోంది. ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా రెండవ విడత స్థల సేకరణ చేయాలని నిర్ణయించి, రెవెన్యూ శాఖకు ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నిధులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో స్థల సేకరణ కూడా పెండింగ్‌లోనే ఉంది. మొత్తం 54 కిలోమీటర్లు పొడవులో నిర్మించే ఈ రైల్వేలైన్‌ కోసం దాదాపు 200 ఎకరాల భూమి సేకరించాలి. తొలి దశ కింద 158.55 ఎకరాలు సేకరించారు. తూర్పుగోదావరి జిల్లాలో భట్లపాలెం, కామనగరువు ప్రాంతాలు అమలాపురం మండలంలో భట్నవిల్లి, రోళ్లపాలెం, భట్లపాలెం, పేరూరు పరిధిలో ప్రాంతాల్లో 60 శాతం స్థలసేకరణ జరిగింది. ఈ ప్రాంతాల్లో మిగిలిన 40 శాతంతో పాటు పశ్చిమగోదావరి జిల్లాలోని యలమంచిలి, నరసాపురం ప్రాంతాల్లో భూసేకరణ రెండవ విడతలో చేపట్టనున్నారు. అయితే ఇప్పటి వరకూ సేకరించిన భూమిలో బాధితులకు పూర్తిస్థాయిలో ఇంకా నష్టపరిహారం చెల్లించనేలేదు.

కూటమి హయాంలో

తొలి బడ్జెట్‌లోనే మొండిచేయి

2001లో ఈ రైల్వేలైన్‌ నిర్మాణం ఆలోచన ఊపందుకున్న తరువాత 2019 నుంచి ప్రతి బబ్జెట్‌లోను ఈ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించారు. 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు కూడా అప్పటి వైఎస్సార్‌సీపీ ఎంపీల కృషితో కేంద్రం ప్రతి బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. విచిత్రం ఏమిటంటే కేంద్రంలోని బీజేపీతో జతకట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రవేశపెట్టిన 2025–26 తొలి రైల్వే బడ్జెట్‌లో నరసాపురం–కోటిపల్లి రైల్వేలైన్‌కు నిధుల కేటాయింపులో మొండిచేయి దక్కడం చెప్పుకోవాలి. రూ 2,800 కోట్ల అంచనా వ్యయంగల ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి గోదావరిపై మూడు పాయల వద్ద వంతెన నిర్మాణం చేయాలి. వంతెన నిర్మాణాలకు రూ.700 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసి టెండర్లు పిలిచి రెండేళ్ల క్రితం ప్రారంభించారు. అయితే అరకొర కేటాయింపులతో పనులు మందకొడిగా సాగుతున్నాయి. మరి రెండవ విడత స్థలసేకరణ పూర్తయిన తరువాత పనులు పరిగెడతాయో లేదో చూడాలి. ప్రాజెక్ట్‌ నిర్మాణం ఆలస్యం అవుతుండటంతో ప్రతి ఏటా నిర్మాణ అంచనా వ్యయం కూడా పెరుగుతూ వస్తోంది. 2001లో రూ.800 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌ అంచనా వ్యయం ప్రస్తుతం రూ.2,800 కోట్లకు చేరింది.

ఎప్పటి నుంచో డిమాండ్‌

మచిలీపట్నం–గుడివాడ–భీమవరం వరకూ ఉన్న రైల్వే లైన్‌ను 1925లో నరసాపురం వరకూ పొడిగించారు. అప్పటి నుంచి నరసాపురం టు కోనసీమకు రైల్వేలైన్‌ అనుసంధానం కావాలనే డిమాండ్‌ ఉంది. దీనివల్ల రవాణా మార్గం సులభమవుతుందని, వ్యాపార వ్యవహారాలతో మొత్తంగా గోదావరి జిల్లాలు అభివృద్ధి బాట పట్టే అవకాశం ఉందని భావించారు. ఇక అప్పటి నుంచీ కోటిపల్లి నుంచి నరసాపురం వరకూ రైల్వేలైన్‌ను పొడిగించాలనే డిమాండ్‌ ఉంది. దివంగత లోక్‌సభ స్పీకర్‌ బాలయోగి చొరవతో ఈ ప్రాజెక్ట్‌కు బీజం పడింది. 2001–02 బడ్జెట్‌లో తొలిసారిగా రూ.100 కోట్లు కేటాయించారు. కానీ నిధులు మాత్రం విడుదల కాలేదు. తరువాత 2016–17 బడ్జెట్‌లో రూ. 200 కోట్లు కేటాయించారు. సర్వేకే ఈ నిధులు చాలని పరిస్థితి. 2019 నుంచి గత ఏడాది వరకూ వరుసగా నిధులు కేటాయించారు. ఇప్పటికి సుమారుగా రూ.1900 కోట్లు నిధుల కేటాయింపు జరిగింది.

వంతెనలకే ఖర్చు ఎక్కువ

ఈ ప్రాజెక్ట్‌ 25 శాతం రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మాణమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌ విషయంలో ఇచ్చిన సొమ్ము వంతెనల నిర్మాణాలకే అధిక మొత్తం ఖర్చువుతోంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావవరి జిల్లాల్లోని గోదావరి పాయలుగా ఉన్న వైనతేయి, గౌతమి, వశిష్ట నదులపై వంతెనలు నిర్మించాలి. రూ.700 కోట్లతో ఈ మూడు వంతెనల పనులు నత్తనడకన సాగుతున్నాయి.

రెండవ విడత స్థల సేకరణకు గ్రీన్‌ సిగ్నల్‌

2019–24 మధ్య నుంచి ప్రతి బడ్జెట్‌లో నిధులు

కూటమి హయాంలో తొలి బడ్జెట్‌లోనే మొండిచేయి

ఏటా పెరుగుతున్న అంచనా వ్యయం

ఇప్పటికై నా ప్రాజెక్ట్‌ పరుగులు పెట్టేనా?

కోటిపల్లి రైల్వేలైన్‌ నిర్మాణంలో కదలిక 1
1/1

కోటిపల్లి రైల్వేలైన్‌ నిర్మాణంలో కదలిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement