అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష | - | Sakshi
Sakshi News home page

అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష

Jul 23 2025 5:33 AM | Updated on Jul 23 2025 5:33 AM

అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష

అత్యాచారం కేసులో పదేళ్ల జైలు శిక్ష

ఏలూరు (టూటౌన్‌)/పెనుగొండ: అత్యాచారం కేసులో నిందితుడికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా కోర్టు అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డీవీ రామాంజనేయులు వెల్లడించారు. పెనుగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బాధిత యువతి వ్యవసాయ కూలీగా జీవనం సాగించేది. సుమారు ఏడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన నిందితుడు అంజూరి ప్రసన్న కుమార్‌ ప్రేమ పేరుతో ఆమెకు సన్నిహితమయ్యాడు. వివాహం చేసుకుంటానని మోసం చేసి, ఆమెను బలవంతంగా శారీరక సంబంధానికి గురిచేశాడు. అనంతరం నిందితుడు విదేశానికి (గల్ఫ్‌) పరారయ్యాడు. తన తల్లిదండ్రుల సహకారంతో ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. దీనిపై బాధిత యువతి పెనుగొండ పోలీస్‌స్టేషన్‌న్‌లో ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్సై బి.మోహన్‌రావు కేసు నమోదు చేశారు. అనంతరం సీఐ జీవీవీ నాగేశ్వరరావు పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించి కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ముద్దాయి అంజూరి ప్రసన్న కుమార్‌కు పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటుగా రూ.5 వేలు జరిమానా విధిస్తూ మహిళా కోర్టు ఐదవ అదనపు జిల్లా జడ్జి ఆర్‌వీవీఎస్‌ మురళీకృష్ణ మంగళవారం తీర్పు వెలువరించారు. అడిషనల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డీవీ రామాంజనేయులు వాదనలు వినిపించగా కోర్టు కానిస్టేబుల్‌ తిమ్మరాజు నాగబాబు, లైజనింగ్‌ ఆఫీసర్‌ ఏఎస్సై ఎస్‌.ప్రదీప్‌ కుమార్‌ విచారణకు సహకరించారు.

ఎస్‌ఆర్‌కేఆర్‌లో మెగా టెక్నికల్‌ మేళా

భీమవరం (ప్రకాశంచౌక్‌): భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆగస్టు 4 నుంచి 14వ తేదీ వరకు శ్రీవేదిక్‌ విజన్‌ 2కే 25్ఙ పేరిట స్పోర్ట్స్‌ అండ్‌ హెల్త్‌ అంశంపై మెగా టెక్నికల్‌ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కేవీ మురళీకృష్ణంరాజు చెప్పారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం జగపతి రాజు మంగళవారం కళాశాలలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేశారు. ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ ఫిజికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఫుల్‌ జావా స్టాక్‌ నైపుణ్యాలను ఉపయోగించి ఆరోగ్య యోగ, క్రీడా రంగాల్లో నూతన పరిష్కారాలను అభివృద్ధి చేసే విధంగా పది రోజుల పాటు జరిగే బూట్‌ క్యాంపులో విద్యార్థులకు శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.

సౌత్‌ జోన్‌ రోల్‌బాల్‌ పోటీలకు ఎంపిక

తణుకు అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ రోల్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 19, 20 తేదీల్లో కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్‌ 17, 17 ఏళ్లు పైబడిన విభాగాల్లో పశ్చిమగోదావరి జిల్లా క్రీడాకారులు ద్వితీయస్థానంలో నిలిచినట్లు రోల్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి వానపల్లి లావణ్య తెలిపారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన క్రీడాకారులు ఆగస్టులో నిర్వహించనున్న సౌత్‌ జోన్‌ రోల్‌బాల్‌ పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఇటీవల తణుకులో నిర్వహించిన స్కేటింగ్‌ రోల్‌బాల్‌ పోటీల్లో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అండర్‌ 11, 14, 17, 17 ఏళ్లు పైబడిన వారికి నిర్వహించిన పోటీల్లో అర్హత సాధించిన 20 మంది క్రీడాకారులు కాకినాడలో రోల్‌బాల్‌ పోటీల్లో పాలొన్నారని చెప్పారు.

బైక్‌ చోరీ కేసులో జైలు

ముదినేపల్లి రూరల్‌: మోటార్‌బైక్‌ల దొంగతనం కేసులో ఓ వ్యక్తికి 164 రోజుల శిక్ష విధించినట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఉరదాపాలెంకు చెందిన జొన్నల వెంకటేష్‌ ముదినేపల్లి మండలంలో బైక్‌ దొంగతనం చేస్తూ పట్టుబడినట్లు తెలిపారు. అతడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు పంపిన అనంతరం విచారణ జరిపిన కై కలూరు మేజిస్ట్రేట్‌ ముద్దాయికి 164 రోజులు జైలుశిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెలువడించినట్లు ఎస్సై తెలిపారు.

వివాహిత అనుమానాస్పద మృతి

భీమవరం (ప్రకాశంచౌక్‌): భీమవరం రాయలంలో లావణ్య (28) అనే వివాహిత మంగళవారం ఉదయం ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భీమవరం టూటౌన్‌ సీఐ కాళీ చరణ్‌ తెలిపారు. ఆమె మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement