
టిడ్కో ఇళ్ల సమస్య పరిష్కరించాలి
పాలకొల్లు సెంట్రల్: టిడ్కో ఇళ్లను పూర్తి చేసి సౌకర్యాలు కల్పించి అర్హులైన వారికి అందించాలని కోరుతూ మంగళవారం సీపీఎం నాయకులు ఎర్ర వంతెన వద్ద ధర్నా చేశారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గోపాలన్ మాట్లాడుతూ పాలకొల్లులో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి 18 ఏళ్లు గడిచినా నేటికీ ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదని విమర్శించారు. ఇళ్లు పొందిన అర్హులు ఇప్పటికే కొంతమంది చనిపోయారన్నారు. ఈ ప్రభుత్వానికి పేదవాడి ఇంటి సమస్య పట్టడం లేదన్నారు. టిడ్కో ఇళ్ల ప్రాంతాల్లో విష సర్పాల సంచారంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారని, పొదలు తొలగించి పారిశుధ్య సమస్య మెరుగుపరచాలన్నారు. ప్రజలకు నివాసయోగ్యంగా ఉండేటట్లు ఇళ్ళు నిర్మించి వెంటనే అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలాలుగా ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడచినా ఇంతవరకు ఒక సెంటు భూమి కూడా పేదలకు ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు
మోటార్‌బోర్ల వైర్ల చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: మోటార్ బోరు కేబుల్ వైర్ల చోరీకి సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వేగవరం గ్రామానికి చెందిన దార విశ్వేశ్వర శ్రీనివాస్‌కు చెందిన పొలంలో ఈ నెల7వ తేదీ రాత్రి రూ.1.60 లక్షలు విలువైన 650 మీటర్ల బోరు కేబుల్ వైరు చోరీకి గురైంది. అదే రోజు రాత్రి మరో 8 మంది రైతుల పొలాల్లో బోర్లకు సంబంధించి కరెంటు వైర్లు కట్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. అలాగే ఈ నెల 9వ తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన మోటేపల్లి సుబ్రహ్మణ్యంకు చెందిన రూ.2 లక్షలు విలువైన 810 మీటర్ల మోటార్ కేబుల్‌వైరు, సమీపంలోని మరో 8 మందికి చెందిన మోటార్ల కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. దీనిపై రైతులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేయగా, అక్కడ నుంచి వచ్చిన సమాచారం మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్సై తెలిపారు. డీఎస్పీ యు.రవిచంద్ర ఆదేశాల మేరకు సీఐ ఎంవీ సుభాష్ పర్యవేక్షణలో ఎస్సై జబీర్, ఏఎస్సై ఎన్‌వీ సంపత్‌కుమార్, పీసీ ఎన్.రమేష్ నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం వేగవరం ఇందిరా కాలనీ వద్ద అదే గ్రామానికి చెందిన నిందితులు తాళరి రామకృష్ణ, చెల్లూరి నాగరాజు, పసలపూడి రాజులను అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 3.60 లక్షల 19 రోల్స్ కేబుల్ వైర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, 15 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు.