
కొత్త రెస్టారెంట్‌లో కుళ్లిన మాంసం
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో వెల్లడి
తాడేపల్లిగూడెం : పట్టణంలోని స్కై గార్డెన్ రెస్టారెంట్‌లో మంగళవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండానే రెస్టారెంట్ నడుపుతున్నట్లు తనిఖీలో వెల్లడైంది. కుళ్లిన మాంసం, కూరగాయలు, నిఽషేధించిన ప్లాస్టిక్ వస్తువులు వాడుతున్నట్టు ఈ సందర్భంగా గుర్తించారు. చికెన్ లాలీపాప్‌లు నిల్వ ఉన్నట్లు కనుగొన్నారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను వాడుతుండటంతో వాటిని స్వాధీనం చేసుకుని రూ.5 వేల జరిమానా విధించారు. చికెన్ తండూరి, చికెన్ లాలీపాప్లను శాంపిల్స్ తీసి నాచారంలోని స్టేట్ ఫుడ్ లాబరేటరీకి పంపించారు. రెస్టారెంట్లో గుర్తించిన లోపాలపై అధికారులు యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి కేసు నమోదు చేశారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుంటే లైసెన్సు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ కే.వెంకటరత్నం, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏ.సుందరరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎం.ఏసుబాబు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి దుర్మరణం
పెదవేగి: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెదవేగి మండలం బాపిరాజుగూడెం గ్రామానికి చెందిన చొదిమెల్ల యాకోబు (45) గ్రామంలో నూతనంగా ఒక ఇంటిని నిర్మించుకుంటున్నాడు. ఈ మేరకు మంగళవారం ఆ ఇంట్లో పనిచేస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయాడు. హుటాహుటిన కుటుంబ సభ్యులు స్థానికుల సాయంతో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.