జాతీయ స్థాయి నాటిక పోటీలు ప్రారంభం
భీమవరం: సమాజాన్ని చైతన్య పరిచేవి కళలేనని, వాటిలో తొలి ప్రాధాన్యం సాంఘిక నాటికలేదేనని పలువురు వక్తలు అన్నారు. కళారంజని 14వ వార్షికోత్సవ జాతీయ స్థాయి తెలుగు నాటికల పోటీలు బుధవారం రాత్రి భీమవరంలోని సోమేశ్వర జనార్ధన స్వామి వార్ల ఆలయ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చుక్కన్నశ్రీ స్మారక పురస్కారంను నటులు, దర్శకులు, రచయిత, ప్రయోక్త వేల్పూల నాగేశ్వరరావుకు, జవ్వాది సూర్యారావు స్మారక పురస్కారంను విశాఖపట్టణంకు చెందిన చలసాని కృష్ణప్రసాద్‌కి అందజేసి వారిని దుశ్శాలువాలతో పూలమాలలతో సత్కరించారు. ముందుగా బీవీకే కీయోషన్ కాకినాడ వారి తితిక్ష నాటికను ప్రదర్శించి, అనంతరం సత్కార కార్యక్రమం నిర్వహించారు. రెండవ నాటికగా శ్రీ కృష్ణ తెలుగు థియేటర్ ఆర్ట్ విజయవాడ వారి అపస్వరం నాటికలను ప్రదర్శించారు. ఈ నాటికలో నటించిన కళాకారులు వారి హావభావాలతో అందరిని అలరించారు. కార్యక్రమంలో బుద్దాల వెంకట రామారావు, రాయప్రోలు భగవాన్, జవ్వాది దాశరథి శ్రీనివాస్, నల్లం వెంకట కృష్ణారావు, గుండా రామకృష్ణ, మల్లుల సీతారాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


