రియల్‌..ఢమాల్‌ | - | Sakshi
Sakshi News home page

రియల్‌..ఢమాల్‌

Dec 1 2024 12:29 AM | Updated on Dec 1 2024 12:29 AM

రియల్‌..ఢమాల్‌

రియల్‌..ఢమాల్‌

సాక్షి ప్రతినిధి, ఏలూరు: రియల్‌ ఎస్టేట్‌ ఊపందుకుంటుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న వారికి కూటమి ప్రభుత్వంలో నిరాశే ఎదురైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రియల్‌ ఎస్టేట్‌ పెరుగుతుందని అనుకుంటే పరిస్ధితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ఎన్నికలు తరువాత నుంచి మార్కెట్‌లో నగదు లావాదేవీలు పూర్తిగా తగ్గిపోవడం, ఏటా ఐదు శాతం కూడా భూమి ధరలు పెరుగుతున్న పరిస్థితులు లేకపోవడం, నిర్మాణాలకు ఇసుక కొరత వెంటాడుతుండటం ఇలా అన్ని సమస్యలు కలిసి జిల్లాలో రియల్‌ ఎస్టేట్‌ కుదేలైంది. దీంతో నిత్యం రిజిస్ట్రేషన్లతో కళకళలాడే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి.

ఆసక్తి చూపని కొనుగోలుదారులు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గతేడాది ఉన్న మార్కెట్‌ ధరలే నేటికీ కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల తక్కువగా ఉండటంతో కొనుగోలుదారులు, అమ్మకందారులు విక్రయాలకు ఆసక్తి చూపడం లేదు. పశ్చిమగోదావరి జిల్లాలో 15 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు పరిధిలో సుమారు 410 ఎకరాల్లో రియల్‌ వెంచర్లు ఉన్నాయి. ప్రధానంగా భీమవరం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలో పదుల సంఖ్యలో వెంచర్లు ఉన్నాయి. ఒక్క తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాంలోనే 25కు పైగా వెంచర్లున్నాయి. ఏలూరు జిల్లాలో 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో 240 ఎకరాలకుపైగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు ఉన్నాయి. ఏలూరు, జంగారెడ్డిగూడెం, కై కలూరు, నూజివీడు, చింతలపూడిలో రియల్‌ వెంచర్లు అధికంగా ఉన్నాయి. వందల ఎకరాల్లో ఉన్న వెంచర్లలో నెలకు 20 ప్లాట్లు కూడా అమ్ముడవని పరిస్ధితి. నిర్మాణరంగం కూడా ఇంచుమించు ఇదే పరిస్థితుల్లో ఉంది. జాతీయ రహదారి వెంట, కార్పొరేషన్‌ పరిధి, గేటెడ్‌ కమ్యూనిటీ, లక్కీడిప్‌లు, లాటరీలు ఇలా ఎన్నిరకాల స్కీంలతో రియల్‌ కంపెనీలు విస్తృత ప్రచారం చేసినా కొనుగోలుదారుల్లో ఆసక్తి కనిపించడం లేదు.

నగదు రొటేషన్‌ లేక ఢీలా

వెంచర్లతో పాటు పొలాలు, పట్టణాల్లోని ఖాళీ స్థలాల విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. ఏలూరు నగరపాలక సంస్ధ పరిధిలోని శనివారపుపేట మెయిన్‌ రోడ్డు వెంట గతేడాది మొదట్లో రూ.25 వేలు పలికిన చదరపు గజం ఈ రోజుకూ అదే ధర ఉంది. అమ్మకందారుడికి అత్యవసరమైతే మరింత తక్కువకు కూడా విక్రయాలు జరుగుతున్న పరిస్థితులున్నాయి. నిర్మాణం పూర్తై విక్రయాలకు నోచుకోక వందల ఇళ్లు బిల్డర్ల వద్దనే ఉన్నాయి. వాస్తవానికి ఏడాదిన్నర క్రితం వరకు ఏలూరు, జంగారెడ్డిగూడెం, కై కలూరు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరంలో రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు స్పీడ్‌గా ఉండటంతో పాటు ఏటా సగటున 10 నుంచి 20 శాతం రియల్‌ పెరుగుదల ఉంది. ముఖ్యంగా జిల్లాలోని జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెంలో గత ఐదేళ్ళల్లో భూముల ధరలు దాదాపు రెట్టింపయిన పరిస్ధితి. జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీ పరిధిలో వేగంగా అభివృద్ధి జరగడం, పోలవరం పరిహారం పొందిన వారిలో ఎక్కువ మంది జంగారెడ్డిగూడెం చుట్టుపక్కలే భూములు కొనుగోలు చేస్తుండటంతో గత ఏడేళ్లుగా రెండు రెట్ల భూమి విలువ పెరిగింది. కూటమి ప్రభుత్వం రాగానే అమరావతి ప్రచారంతో పెట్టుబడులు అమరావతి వైపే మళ్ళిస్తుండటంతో ఆరు నెలల వ్యవధిలో కొత్త వెంచర్లు ప్రారంభం కాలేదు.

తగ్గిపోతున్న రిజిస్ట్రేషన్లు

ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో గతేడాదితో పోల్చితే ఏలూరు జిల్లాలో 11,180, పశ్చిమగోదావరి జిల్లాలో 12,290 రిజిస్ట్రేషన్లు తగ్గాయి. 2023 జనవరి 1 నుంచి నవంబర్‌ 29 వరకు ఏలూరు జిల్లాలో 12 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో విక్రయాలు గిఫ్ట్‌ డీడ్‌, తనఖా రిజిస్ట్రేషన్లు, ఇతర రిజిస్ట్రేషన్లు కలిపి 68,270 జరగగా, ఈ ఏడాదిలో నవంబర్‌ 29 వరకు 54,690 మాత్రమే జరిగాయి. దీనిలో కూడా అత్యధికంగా ఏలూరు, నూజివీడు, భీమడోలు, చింతలపూడిలోనే జరిగాయి. పశ్చిమగోదావరి జిల్లాలో గతేడాది అన్ని రకాల రిజిస్ట్రేషన్లు కలుపుకుని 15 కార్యాలయాల పరిధిలో 96,377 జరగగా ఈ ఏడాది ఇంతవరకు 84,087 జరిగాయి. పశ్చిమలో అత్యధికంగా తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నర్సాపురం, తణుకులో ఉన్నాయి.

ఉమ్మడి జిల్లాలో స్తంభించిన రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలు

సుమారు 650 ఎకరాల్లో ప్రైవేటు వెంచర్లు

నెలకు పదుల సంఖ్యలో కూడా లేని అమ్మకాలు

మార్కెట్‌లో నగదు లావాదేవీలు తగ్గడమే ప్రధాన కారణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement