ఎల్కతుర్తి: సమస్యల పరిష్కారమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ స్పష్టం చేశారు. సూరారం, దండేపల్లి, వీరనారాయణపూర్, వల్భాపూర్, ఇందిరానగర్ గ్రామాల్లో పల్లెపల్లెకు పొన్నం అన్న–పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమం శనివారం నిర్వహించారు. మంత్రి ఈ కార్యక్రమాల్లో పాల్గొని సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు సేకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కొత్త పెన్షన్ల కోసం అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎల్‌నినోతో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలన్నారు. విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆయిల్‌పామ్ సాగువైపు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని, జలసిరి పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్లాస్టిక్‌కు స్వస్తి పలికి స్టీల్ బ్యాంకును వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థుల సంఖ్య పెంచాలని సూచించారు. యువత ఫోన్లకు బానిసకాకుండా క్రీడామైదానాలకు వెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. గతంలో రేషన్‌కార్డుల కోసం సంవత్సరాలుగా ఎదురుచూడాల్సి వచ్చేదని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులకు రేషన్‌కార్డులు అందించే ప్రక్రియ చేపట్టిందని తెలిపారు. జెడ్పీ సీఈఓ గురువయ్య, ఆర్డీఓ వెంకటేశ్, డీఆర్డీఓ మేన శ్రీను, అడిషనల్ కలెక్టర్ శేషాద్రి, ఏడీఏ ఆదిరెడ్డి, ఎంపీడీఓ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్


