జిల్లాలో సాగు వివరాలిలా..
ఖిలా వరంగల్: జిల్లాలో పంటల సాగు వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ డిజిటల్ పంటల సర్వేకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జియో ట్యాగింగ్ విధానంలో క్షేత్రస్థాయిలో పంటల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేస్తుండడంతో సాగు విస్తీర్ణంపై ఇక కచ్చితమైన గణాంకాలు అందుబాటులోకి రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతీ సర్వే నంబర్‌లోని ప్రతీ ప్లాట్‌ను పరిశీలించి పంట రకం, సాగు విస్తీర్ణం తదితర వివరాలను డిజిటల్‌గా నమోదు చేస్తున్నారు.
పంటల సాగులో స్పష్టత
జిల్లాలో పంట సాగు వివరాల సేకరణకు పంట సర్వేను ఈనెల 24న వ్యవసాయశాఖ ప్రారంభించింది. ఈసారి సర్వేను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తున్నారు. జియో ట్యాగింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో పంటల వివరాలను నమోదు చేస్తూ సాగు విస్తీర్ణాన్ని పక్కాగా లెక్కిస్తున్నారు. దీంతో పంటల వాస్తవ పరిస్థితిపై స్పష్టమైన సమాచారం అందుబాటులోకి రానుంది. జిల్లాలో 13 మండలాలు ఉండగా 184 గ్రామాలు ఉన్నాయి. గ్రామాల్లో ఇంటర్, డిగ్రీ పూర్తిచేసి వ్యవసాయ అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం గల 184 మందిని సర్వే సిబ్బందిగా నియమించారు. వారి ద్వారా ఈనెల 24న జిల్లాలో గ్రామాల వారీగా సర్వే ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 3.70 లక్షల ప్లాట్లు ఉండగా ఇప్పటి వరకు 16,049 ప్లాట్లలో డిజిటల్ పంటల సర్వే పూర్తిఅయింది. మిగిలిన ప్లాట్లలో సర్వేను వేగవంతం చేశారు. జిల్లాలో మొత్తం 1,56,396 మంది రైతులకు సంబంధించిన సర్వే నంబర్లులోని పంటల వివరాలను సిబ్బంది సేకరిస్తున్నారు. జిల్లాలో ప్రధాన పంటగా వరి సాగువుతోంది. ఇప్పటి వరకు నమోదైన వివరాల ప్రకారం 64,293 ఎకరాల్లో వరిని రైతులు సాగు చేశారు. మరో 33,438 ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగవుతున్నాయి. సర్వే పూర్తయితే జిల్లాలో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగువుతోందన్న దానిపై పూర్తి స్పష్టత రానుంది.
జియో ట్యాగింగ్‌తో పారదర్శకత
పంటల సర్వేలో జియో ట్యాగింగ్ వినియోగిస్తుండడంతో క్షేత్రస్థాయిలో నమోదైన వివరాలను మరింత కచ్చితంగా గుర్తించే అవకాశం ఉంటుంది. సర్వే సిబ్బంది నేరుగా పొలాల వద్దకు వెళ్లి సర్వే నంబర్ల ఆధారంగా పంటలను పరిశీలించి డిజిటల్ విధానంలో ఫొటోలు అప్‌లోడ్ చేసి సాగు వివరాలను నమోదు చేస్తున్నారు. దీంతో సాగు విస్తీర్ణంలో తేడాలు లేకుండా చూడడంతోపాటు ప్రభుత్వానికి అవసరమైన పంటల గణాంకాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతీ రైతు సాగు చేస్తున్న పంట, విస్తీర్ణాన్ని కచ్చితంగా నమోదు చేయడం, సాగు భూమిని భౌగోళికంగా గుర్తించడం, రైతు, భూమి, పంట వివరాలను ఒకే డిజిటల్ డేటా బేస్‌లో అనుసంధానం చేయడం ఈ సర్వే ఉద్దేశం.
జియో ట్యాగింగ్‌తో
పంటల నమోదు
కొనసాగుతున్న డిజిటల్ సర్వే
వరిసాగుకే రైతుల మొగ్గు
3.70 లక్షల ప్లాట్లు
సర్వే పూర్తిఅయిన ప్లాట్లు 16,049
వరి సాగు 64,293 ఎకరాలు
ఆరుతడి పంటలు 33,438 ఎకరాలు
రైతుల సంఖ్య 1,56,396


