న్యూశాయంపేట: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నోటీసుల పంపిణీని వేగవంతం చేసి ఫిర్యాదులు, అభ్యంతరాలపై నిర్ధిష్ట గడువులో విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలతో హైదరాబాద్ నుంచి శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద వీసీలో పాల్గొని జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన చర్యలను వివరించారు. జిల్లా వ్యాప్తంగా 1,94,399 నోటీసులకుగాను ఇప్పటివరకు 11,173 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు అవసరమైన పత్రాలతో గడువులోపు ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ కార్యాలయాల్లో సమర్పించేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. వీసీలో అదనపు కలెక్టర్ వైవీ గణేష్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, ఎన్నికల సూపరింటెండెంట్ రజిని, అధికారులు పాల్గొన్నారు.
గ్రూప్స్ పరీక్షలకు మైనార్టీలకు ఉచిత కోచింగ్
న్యూశాయంపేట: తెలంగాణ మైనార్టీ స్టడీ సర్కిల్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్ ద్వారా టీజీపీఎస్సీ గ్రూప్ –1,2,3,4 ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరిచేందుకు మైనార్టీలకు ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను, వరంగల్ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేష్ శనివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. డిగ్రీ పాసైన మైనార్టీ కమ్యూనిటీకి చెందిన (ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, పార్సీలు, బౌద్ధులు) అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1నుంచి 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 040–23236112, 90590 50062 నంబర్లలో లేదా ఆయా జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి కార్యాలయాల్లో సంప్రదించాలని వారు సూచించారు.
ఆర్థికంగా ఎదగాలి
వర్ధన్నపేట: ప్రభుత్వ సంక్షేమ పథకాలతో మహిళలు ఆర్థికంగా ఎదగాలని డీఆర్‌డీఓ నాగపద్మజ సూచించారు. మండలంలోని వెంకట్రావ్‌పల్లి, కొత్తపల్లి గ్రామాలను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా వెంకట్రావ్‌పల్లిలో ఇందిరమ్మ మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రాన్ని సందర్శించి కార్యకలాపాలను పరిశీలించారు. అనంతరం, కొత్తపల్లి గ్రామాన్ని సందర్శించి పంచాయతీ పరిధిలోని వీఓ భవనం, పీఎస్‌సీ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. వెంకట్రావ్‌పల్లిలో వీఓ భవనం, అంగన్‌వాడీ భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఎంపీడీఓ వెంకటరమణ, ఏపీఓ నాగేశ్వర్, సర్పంచ్‌లు కుల్ల పావని యాకాంతం, కౌడగాని సునీత, రాజేష్‌ఖన్నా, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు
వరంగల్ క్రైం: వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించే నీటీ పీజీ ప్రవేశ పరీక్ష 2026కు అయా పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం 6నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్షన్ 163 బీఎన్‌ఎస్ అమలులో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండరాదని సూచించారు. ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించరాదని పేర్కొన్నారు. పరీక్ష సమయంలో పరిసరాల్లోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తుతోపాటు ట్రాఫిక్ ఆంతరాయం కలగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
నీట్ ఎగ్జామ్ సెంటర్ పరిశీలన
నర్సంపేట: బిట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన నీట్ పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సెంటర్‌ను ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ ముస్కు శ్రీనివాస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షల కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు వారు తగు సూచనలు చేశారు. కాగా, ఈ కేంద్రంలో 132మంది విద్యార్థులు ఆదివారం పరీక్ష రానున్నారు.


