కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రోగుల వైద్యసేవల్లో నిర్లక్ష్యం చేస్తున్న సిబ్బంది తీరు, ఆస్పత్రి సమస్యలపై డీఎంఈ (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) డాక్టర్ వాణి ఆరా తీశారు. అలాగే, కలెక్టర్ డాక్టర్ సత్యశారద కూడా అధికారుల నుంచి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. ఆయా వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిపై ఎంజీఎం అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘మహాత్మా’.. మారేదెప్పుడు? శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వైద్యసేవల్లో నిర్లక్ష్యం చేస్తున్న మందలించారు. అలాగే, ఓపీ విభాగాలు, వార్డుల్లో రౌండ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఈ వాణి మాట్లాడుతూ ఎంజీఎంలో సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, పేషంట్లకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అదనపు వైద్యుల నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 30న పీజీ సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులను ఆస్పత్రిలో నియమిస్తామని పేర్కొన్నారు. అలాగే, ఆర్‌ఎంఓలు పూర్తిగా ఉండేవిధంగా చూస్తామని, వైద్యసేవలను మె రుగుపరిచేందుకు అదనపు ఆర్‌ఎంఓల నియామకానికి ఆదేశాలు ఇస్తామని వివరించారు. స్టెచర్లు, వీల్‌చైర్లు అందుబాటులో ఉండేవిధంగా చూస్తామని, త్వరలో తాను ఎంజీఎంను సందర్శించి అధికారులతో సమీక్ష చేస్తామని ఆమె వెల్లడించారు.


