● వివాహ వేడుకకు వెళ్లొస్తుండగా ఘటన.. మహిళ మృతి
భీమదేవరపల్లి: ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి వస్తుండగా.. కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలో పడడంతో ఓ మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన భీమదేవరపల్లి మండలం రాంనగర్ (మంగళపల్లి) శివారులో గురువారం జరిగింది. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్‌కు చెందిన ఏలూరి రవీందర్‌రెడ్డి, వీరారెడ్డి, కిరణ్, రాధ హుస్నాబాద్ మండలం పోతారాంలో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. అనంతరం కారులో తిరిగి వస్తుండగా.. రాంనగర్ శివారులో కారు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాధ అక్కడికక్కడే మృతి చెందగా.. మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


