మళ్లీ ‘లేఖల’ లొల్లి? | - | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘లేఖల’ లొల్లి?

Aug 27 2026 1:36 AM | Updated on Aug 27 2026 1:36 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌ : పోలీస్‌శాఖలో ఇన్‌స్పెక్టర్ల బదిలీలు మరోసారి రాజకీయ సిఫారసుల చర్చకు తెరలేపాయి. మల్టీజోన్‌–1 పరిధిలో తొమ్మిది మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అధికారికంగా పరిపాలనా కారణాలతోనే బదిలీలు చేపట్టినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ.. కొందరు ఇన్‌స్పెక్టర్లు ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో తమకు అనుకూలమైన పోస్టింగుల కోసం ప్రయత్నించారన్న ఆరోపణలు పోలీస్‌ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

భూపాలపల్లిలో కీలక మార్పులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న చెన్నూరి శ్రీనివాస్‌ను జయశంకర్‌ భూపాలపల్లి ఎస్‌హెచ్‌ఓగా నియమించారు. అక్కడ చిట్యాల సర్కిల్‌లో పనిచేస్తున్న దగ్గు మల్లేశ్‌ను మల్టీజోన్‌–1, హైదరాబాద్‌కు రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. ఆయన స్థానంలో యడ్లపల్లి సతీష్‌ చిట్యాల సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా నియమించారు. ఇదే జోన్‌ పరిధిలోని నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన ముగ్గురు ఇన్‌స్పెక్టర్‌లకు స్థానచలనం కలిగింది.

వరంగల్‌కు ముగ్గురు.. ఒకరు బయటకు..

వరంగల్‌ కమిషనరేట్‌కు తాజా బదిలీల్లో ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు వచ్చారు. రామగుండం కమిషనరేట్‌ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న తెల్లబోయిన కిరణ్‌, రామగుండం కమిషనరేట్‌ లీగల్‌ సెల్‌లో పనిచేస్తూ మల్టీజోన్‌–1 కంట్రోల్‌ రూమ్‌కు అటాచ్‌ అయి ఉన్న అనుముల శ్రీనివాస్‌ను కూడా వరంగల్‌ కమిషనరేట్‌కు పంపారు. హైదరాబాద్‌ టీజీఐసీసీసీ ఇన్‌స్పెక్టర్‌ భరత్‌ సుమన్‌ను కూడా కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలన్నారు. మరోవైపు వరంగల్‌ కమిషనరేట్‌ సీఎస్‌బీలో పనిచేస్తున్న యడ్లపల్లి సతీష్‌ను జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల సర్కిల్‌కు బదిలీ చేశారు.

అధికారికంగా మాత్రం ‘అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌’..

మల్టీజోన్‌–1 పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బోర్డు జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ తొమ్మిది మంది బదిలీలను ‘ఆన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌’గా పేర్కొంది. దీంతో అధికారిక ఉత్తర్వుల్లో పరిపాలనా కారణాలే కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ సిఫారసులపై చర్చ సాగుతుండటం ఆసక్తికరంగా మారింది. ఎవరి సిఫారసు పనిచేసింది? ఎవరి పోస్టింగ్‌ మారింది? అన్నదానిపై పోలీస్‌ శాఖలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది. భవిష్యత్‌లో జరగనున్న బదిలీలు, పోస్టింగ్‌ల ఉత్తర్వులు వెలువడితే గాని మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

పోలీస్‌ పోస్టింగుల్లో తీవ్ర చర్చ

మల్టీజోన్‌–1లో 9 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

వరంగల్‌ కమిషనరేట్‌కు ముగ్గురు.. ఇక్కడినుంచి ఒకరు బయటకు

ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతో పోస్టింగులంటూ ఆరోపణలు..

గతంలోనూ ఇదే తరహా వివాదాలు

ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగిన ప్రతీసారి రాజకీయ సిఫారసుల అంశం తెరపైకి వస్తుండటం పోలీస్‌ శాఖలో చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా తమకు అనుకూలమైన సర్కిల్‌, కమిషనరేట్‌ లేదా కీలక విభాగంలో పోస్టింగ్‌ కోసం ప్రజాప్రతినిధుల సిఫారసులు తీసుకొస్తున్నారన్న ఆరోపణలు గతంలోనూ వినిపించాయి. తాజాగా మల్టిజోన్‌–1 పరిధిలోని 9 మందికి బదిలీ కాగా.. తమకు అనుకూలమైన పోస్టింగ్‌ల కోసం మరికొందరు ఇన్‌స్పెక్టర్‌లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం. త్వరలోనే వరంగల్‌ కమిషనరేట్‌, జేఎస్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాలకు చెందిన కొందరికి బదిలీలు ఉంటాయంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి కరీంనగర్‌ల నుంచి కొందరు వరంగల్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement