రాయపర్తి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను కలెక్టర్ సత్యశారద బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్లె దవాఖానాలో చిన్నారుల వ్యాక్సినేషన్, మందుల నిల్వలు, సురక్షితంగా భద్రపరిచే తీరును పరిశీలించారు. వైద్య సామగ్రి గురించి ల్యాబ్ ఇన్‌చార్జ్‌ని అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, ఆస్పత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాశ్, సర్పంచ్ గారె సహేంద్ర భిక్షపతి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరుణ్‌ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
అంబులెన్స్‌లో ప్రసవం
చెన్నారావుపేట: అంబులెన్స్‌లో ఓ మహిళ సుఖప్రసవం అయ్యింది. 108 సిబ్బంది పైలట్ నాగరాజు కథనం ప్రకారం.. పాపయ్యపేట గ్రామానికి చెందిన పుప్పాల లావణ్య బుధవారం పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. పైలట్ నాగరాజు, ఏటీఎం ప్రవీణ్ గ్రామానికి చేరుకున్నారు. లావణ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో పురిటి నొప్పులు తీవ్రం కావడంతో ఏటీఎం ప్రవీణ్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రసవం చేయించారు. లావణ్య ఆడశిశువుకు జన్మనిచ్చింది. అనంతరం తల్లి, శిశువును నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు సైతం 108 సిబ్బందిని అభినందించారు.
ఇల్లందలో షార్ట్‌సర్క్యూట్
వర్ధన్నపేట: మండలంలోని ఇల్లంద గ్రామంలో షార్ట్‌సర్క్యూట్‌తో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. సుమారు 50 ఇళ్లలో విద్యుత్ మీటర్లు, వైరింగ్, గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. ప్రమాదంలో ప్రాణనష్టం నష్టం లేకున్నా ఆస్తి నష్టం జరిగి నట్లు తెలుస్తోంది. రహదారిపై అధిక లోడ్‌తో ప్రయాణించే వాహనాలు 11 కేవీ తీగలకు తగలడంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు.
హన్మకొండ కల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ హనుమకొండ ఆధ్వర్యంలో మన గుడి శ్రావణ మాసోత్సవాల ప్రచార బ్యానర్‌ను బుధవారం ఆవిష్కరించారు. ఈమేరకు బుధవారం సాయంత్రం హనుమకొండలోని రెడ్డి కాలనీ లోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి బత్తిని వెంకటయ్య, అర్చకుడు కొండపాక శ్రీనివాసాచారి, టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమ నిర్వాహకుడు రామిరెడ్డి కృష్ణమూర్తి ప్రచార బ్యానర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఈ నెల 28న హనుమకొండ రెడ్డికాలనీలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో విదూషిమణి గుదిమెళ్ల హారావళి, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో బి.శ్రీనివాసులురెడ్డిచే ప్రవచన కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో పాము
నర్సంపేట రూరల్: నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో బుధవారం రాత్రి పాము కలకలం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం.. నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వైద్య కళాశాల వద్ద ఒక గేటు, ఐపీ బ్లాక్ వద్ద మరో గేటు ఉంది. ఆ గేటు మూసివేయడంతో రోగులు వైద్య కళాశాల గేట్ నుంచి వస్తున్నారు. ఐపీ బ్లాక్ ఎదుట ఉన్న గేటు పక్కనే ఉన్న ప్రహరీకి నల్లాలను ఏర్పాటుచేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగి బంధువులు భోజనం చేసి చేతులు కడుక్కునేందుకు నల్లాల వద్దకు వెళ్లగా పాము కనిపించింది. దీంతో ఒక్కసారిగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి పామును చంపేశారు.


