సంగెం: పరిహారం అందించిన తర్వాతనే విజయవాడ–నాగ్‌పూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు ప్రారంభించాలని భూనిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలో పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన రైతులు నాల్లం సూరయ్య, నాల్లం సాంబయ్య, ఫారం కుమారస్వామి తదితర రైతులు మాట్లాడుతూ పనులు అడ్డుకుంటే తమపైనే కేసులు పెడతామని అధికారులు బెదిరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాము సాదాబైనామాలో ఉన్నామని, పట్టాలున్న రైతులకే పరిహారం చెల్లించారని పేర్కొన్నారు. పట్టా ఉంటేనే పరిహారం చెల్లిస్తామని తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరికి భూమి తక్కువగా పోగా ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించారని, ఎక్కువ భూమి పోయినవారికి తక్కువగా చెల్లించారని తెలిపారు. ఒక్కో రైతుకు వాస్తవంగా పోతున్న భూమి ఎంత, పరిహారం అందింది ఎంత అనేది బహిరంగ పరచాలని డిమాండ్ చేశారు. పట్టాలు లేవనే కారణంతో తాతాల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూములకు పైసా చెల్లించలేదని, పరిహారం ఇవ్వకుండా పనులు చేయవద్దని కోరారు. భూములు కోల్పోయిన రైతులకు కాకుండా బినామీలకు పరిహారం చెల్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి గ్రీన్‌ఫీల్డ్ హైవేలో కోల్పోతున్న భూముల లెక్కలు తేల్చాలని, అర్హులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కుటుంబాలతో కలిసి ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరించారు.
గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే
భూనిర్వాసిత రైతుల డిమాండ్
సంగెం మండల కేంద్రంలో
నిలిచిపోయిన నిర్మాణం


