సాక్షి, వరంగల్: సెల్ఫ్ డ్రైవింగ్ కారులో గంజాయి తరలిస్తున్న కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులను వరంగల్ – ఖమ్మం హైవేలోని వర్ధన్నపేటలో వరంగల్ నార్కొటిక్స్ పోలీస్ స్టేషన్ (ఈగల్ ఫోర్స్) పోలీసులు పట్టుకున్నారు. మార్కెట్‌లో సుమారు రూ.64.66 లక్షల విలువ చేసే 129.334 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వరంగల్ నార్కొటిక్ పోలీసు స్టేషన్ డీఎస్పీ పి.రమేష్ కుమార్ మీడియాకు సోమవారం వెల్లడించారు. కేరళకు చెందిన సాయుజ్ సీఎస్, బెసలెల్ సి. మాథ్యూ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. కేరళలో ఓనం పండుగ ఉందని వెళ్లేందుకు సెల్ఫ్ డ్రైవింగ్ కారు కావాలనడంతో వారి స్నేహితుడు కారు బుక్ చేశాడు. వారు బెంగళూరు నుంచి సెల్ఫ్‌డ్రైవ్ కారులో బయలుదేరి రాజమండ్రి మీదుగా ఒడిశాలోని చిత్రకొండ, దారకొండ ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ విక్కీ నుంచి గంజాయి కొనుగోలు చేసి రాజమండ్రి, వరంగల్ మీదుగా బెంగళూరుకు తరలించి, అక్కడి నుంచి కేరళకు తీసుకెళ్లి సూత్రధారి అజిత్ కుమార్‌కు ఇచ్చేందుకు వారు ట్రాన్స్‌పోర్టర్లుగా ఈ రవాణా మార్గాన్ని ఎంచుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒక్క ట్రిప్పుకే రూ.40 నుంచి రూ.50 వేలు వస్తాయని నిందితులు చెప్పినట్లు తెలిసింది.
కారు వెనుక సీట్ల కింద 61 ప్యాకెట్లు
గంజాయి అక్రమ రవాణాపై ఆదివారం అందిన విశ్వసనీయ సమాచారంతో ఈగల్ ఫోర్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ కె.కుమారస్వామి నేతృత్వంలోని వర్ధన్నపేటలో వాహన తనిఖీలను సిబ్బంది చేపట్టారు. ఆదివారం సాయంత్రం ఖమ్మం నుంచి వరంగల్ వైపు వస్తున్న టీఆర్ 05 జీ 0275 నంబర్ గల మారుతి కారును ఆపి తనిఖీ చేశారు. కారు వెనుక భాగంలోని సీట్ల కింద దాచిన 61 ప్యాకెట్లను గుర్తించి, వాటిలో మొత్తం 129.334 కిలోల గంజాయి ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో పాటు కారు, రెండు మొబైల్ ఫోన్లు, రూ.2,900 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన విక్కీ గంజాయి సరఫరా చేయగా, సూత్రధారి అజిత్ కుమార్ రవాణా వ్యవహారాన్ని సమన్వయం చేశాడు. వారిద్దరు ప్రస్తుతం పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది.
గతంలోనూ కేసులు
అరెస్టయిన ఇద్దరు నిందితులపై గతంలో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ గంజాయి సంబంధించిన కేసులు ఉన్నాయి. ఈ ఘటనపై వరంగల్ నార్కొటిక్స్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం.11/2026గా ఎన్‌డీపీఎస్ చట్టంలోని సెక్షన్లు 8(సీ) రెడ్‌విత్ 20(బీ)(టూ)(సీ), 27(బీ), 27ఏ, 29 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టయిన ఇద్దరిని రిమాండ్ నిమిత్తం న్యాయస్థానం ముందు హాజరుపర్చనున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న అజిత్, విక్కీతో పాటు గంజాయి సరఫరా, రవాణా, విక్రయాల వెనుక ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు.
వర్ధన్నపేటలో 129.334 కిలోల
గంజాయి స్వాధీనం
సెల్ఫ్ డ్రైవింగ్ కారులో తరలిస్తుండగా పట్టివేత
ఇద్దరు కేరళ డ్రైవర్ల అరెస్ట్,
మరో ఇద్దరి కోసం గాలింపు
వివరాలు వెల్లడించిన వరంగల్
నార్కొటిక్ డీఎస్పీ రమేష్ కుమార్


