● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
కాళోజీ సెంటర్: విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. నగరంలోని మట్టెవాడలో ప్రభుత్వ పాఠశాలలను సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం రుచి, శుచిని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ భోజన తయారీ నుంచి విద్యార్థులకు వడ్డించే వరకు ప్రతి దశలోనూ పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న మధ్యాహ్న భోజన నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. భోజన పథకం నిర్వహణపై అధికారులు ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
వన మహోత్సవ లక్ష్యాలను పూర్తిచేయాలి
న్యూశాయంపేట: వన మహోత్సవ లక్ష్యాలను వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి సమీక్షించారు. మంగళవారం అన్ని జిల్లాల్లో భారీ స్థాయిలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహించి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వీసీలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమానాయక్, డీఎఫ్‌ఓ నిఖిత, అధికారులు పాల్గొన్నారు.


