● డీఐఈఓ శ్రీధర్ సుమన్
కాళోజీ సెంటర్: జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు వరంగల్ జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాధికారి డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. నగరంలోని కృష్ణాకాలనీలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు ఉచితంగా షూ, బ్యాగులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అనూహ్యమైన సౌలభ్యాలు అందుబాటులోకి వస్తున్నాయని చెప్పారు. ఉచిత నోట్ బుక్స్‌తో పాటు బ్యాగులు, షూస్ తదితర సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని మొత్తం 2,704 విద్యార్థులకు త్వరలో యూనిఫాం కూడా అందుబాటులోకి రానుందని వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హరికృష్ణ, లైబ్రేరియన్ వనమాల, అధ్యాపకులు, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


