పర్వతగిరి: మండలంలోని కల్లెడలోని వనిత అచ్యుతపాయి జూనియర్ కళాశాలలో చెస్ నెట్‌వర్క్, రూరల్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్ (ఆర్‌డీఎఫ్) సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కల్లెడ చదరంగం పోటీలను ఆదివారం నిర్వహించారు. జిల్లాలోని 220 మంది 7నుంచి 10వ తరగతి విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం ప్రారంభమైన పోటీలు ఆరు రౌండ్ల పాటు హోరాహోరీగా సాగాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో చదరంగంపై ఆసక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో నిర్వహించిన టోర్నమెంట్ విజేతలకు ఆర్‌డీఎఫ్ వ్యవస్థాపకుడు కల్లెడ రామ్మోహన్‌రావు రూ.72 వేల విలువగల బహుమతులను అందించారు. చెస్ నెట్‌వర్క్ అధ్యక్షుడు సంజయ్, జనరల్ సెక్రటరీ హరితో పాటు ప్రతినిధులు రాజన్న, ఐతా శ్రీనివాస్, అశోక్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వనిత అచ్యుతపాయి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జనార్ధన్, పీఈటీలు, పీడీలు పోటీల నిర్వహణలో పాల్గొని క్రీడాకారులకు అవసరమైన సహకారం అందించారు. పోటీల ముగింపు కార్యక్రమానికి డాక్టర్ పొన్నాల రామయ్య, డాక్టర్ సోమన్న ముఖ్యఅతిథులుగా హాజరై విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. చీఫ్ ఆర్బిటర్‌గా రజనీకాంత్ వ్యవహరించారు.


