● మంత్రి పొన్నం ప్రభాకర్
భీమదేవరపల్లి: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రజాపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండా, మల్లారం, రసూల్‌పల్లి, గ్రామాల్లో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న– పల్లె పల్లెలో ప్రజాపాలన’ వినూత్న కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తూ వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా గ్రామ పంచాయతీల వద్ద ప్రజల సమక్షంలో అధికారులతో సంక్షేమ, అభివృద్ధి పనులపై సమీక్షించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మల్లారంలో పశువులకు టీకాలు వేశారు. అనంతరం రసూల్‌పల్లి నుంచి వీర్లగడ్డ తండాకు వెళ్లే మార్గంలో లో–లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.54 కోట్లు, రసూల్‌పల్లి గ్రామ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.65 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి ప్రకటించారు. రసూల్‌పల్లి–మల్లారం రహదారి అభివృద్ధికి రూ.86 లక్షలు, నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈపనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించాలని గ్రామస్థులు కోరగా, వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి పునఃప్రారంభిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో రసూల్‌పల్లి సర్పంచ్ బోయిని మహేశ్, వీర్లగడ్డ తండా సర్పంచ్ గూగులోతు పూర్ణిమ–రాజు, మల్లారం సర్పంచ్ గూడెల్లి కల్పన, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పోచంపల్లి రాజిరెడ్డి, సీనియర్ నాయకులు అశోక్ ముఖర్జీ, కొలుగూరిరాజు, డబ్బా శంకర్, ప్రమోద్ రెడ్డి, రఘుపతి రెడ్డి, ఆదరి రవి జిల్లా, మండల స్థాయి అధికారులు తహసీల్దార్ రాజేశ్, ఎంపీడీఓ వీరేశం, ఎంఈఓ సునీతరాణి, వ్యవసాయ అధికారి పద్మ, ఎస్సైలు రాజు, దివ్య రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
గౌరవెల్లి పూర్తి కాకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగను
గౌరవెల్లి రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేసే పూర్తి బాధ్యత తనదేనని, గడువులోగా పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే ప్రసక్తే లేదని మంత్రి పొన్నం తేల్చిచెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి న్యాయపరంగా సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిందని, ఇకపై ఎవరు ఎన్ని రాజకీయ లేదా ఇతర అడ్డంకులు సృష్టించినా పనులు ఆగేది లేదన్నారు. భీమదేవరపల్లి మండల పరిధిలో భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే నూటికి నూరు శాతం పూర్తయిందని, మిగతా మండలాల రైతులు కూడా ప్రాజెక్టు ప్రాధాన్యతను గుర్తించి అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భూములు కోల్పోతున్న రైతులకు చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద ఇప్పటికే రూ. 250 కోట్ల పరిహారం నిధులు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కాలువల తవ్వకం పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉందని మంత్రి వివరించారు.


