కరీంనగర్‌లో హత్య.. ఎల్కతుర్తిలో మృతదేహం | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లో హత్య.. ఎల్కతుర్తిలో మృతదేహం

Aug 22 2026 2:05 AM | Updated on Aug 22 2026 2:05 AM

ఎల్కతుర్తి: ఓ మహిళను కరీంనగర్‌లో హత్యచేసి కారు డిక్కీలో తీసుకునివచ్చి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రం సమీపంలో వదిలేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. సదరు మహిళది పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిగా గుర్తించారు. శుక్రవారం ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్‌, ఎస్సై నరసింహారావు తెలిపిన కథనం మేరకు.. ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్‌ సమీప ప్రాంతంలోని కాలనీలో (టీఎస్‌03 ఎఫ్‌ఎఫ్‌ 8034) అనే నంబర్‌ గల కారు అనుమానాస్పదంగా పార్కు చేసి ఉందని, అందులోనుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కారువద్దకు చేరుకొని కారు ఎవరిదని వాకబు చేయగా స్థానిక మండల కేంద్రానికి చెందిన తంగెళ్లపల్లి సదానందంది అని తేలడంతో ఆయనను రప్పించారు. తన కారును ఎడెల్లి భాస్కర్‌రెడ్డికి కుదువపెట్టినట్లు తెలిపాడు. కాగా, కారును ఎల్కతుర్తికి చెందిన భాస్కర్‌రెడ్డి సోదరుడు వినోద్‌రెడ్డి వాడుతున్నట్లు పోలీసులకు తెలిసింది. దీంతో ఓనరైన సదానందం వద్ద ఉన్న మరో తాళం చెవితో కారు డిక్కీ తెరిచి చూడగా మహిళ మృతదేహం కనిపించింది. స్థానిక కార్యదర్శి శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కారులో దొరికిన ఆధార్‌కార్డు ఆధారంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సెంటినరీ కాలనీకి చెందిన అంకతి మానస(33)గా గుర్తించారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు ఘటనాస్థలికి చేరుకుని తమ కూతురు మానస, వినోద్‌రెడ్డి స్నేహితులని తెలిపారు. కాగా, వారిద్దరూ కరీంనగర్‌లో కలుసుకున్నారని, అక్కడే మానసను హత్యచేసి కారులో ఎల్కతుర్తికి తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని ఏం చేయాలో పాలుపోక కారులోనే ఉంచినట్లు సమాచారం. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దారా కవిత ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం కుటుంబసభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. కేసు దర్యాప్తు ముమ్మరం చేశామని, నిందితుడిగా భావిస్తున్న వినోద్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని, త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని డీసీపీ తెలిపారు.

కారు డిక్కీలోని

మహిళ మానసగా గుర్తింపు

మృతురాలిది పెద్దపల్లి జిల్లా

గోదావరిఖని

ఘటనాస్థలిని పరిశీలించిన సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దారా కవిత

పోలీసుల అదుపులో నిందితుడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement