న్యూశాయంపేట: వానాకాలం సాగులో రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా చూడడంతో పాటు మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లాభసాటి పంటల సాగుపై వారికి అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయశాఖ, సహకార, రెవెన్యూ, పంచాయతీరాజ్, మార్క్‌ఫెడ్ అధికారులు, విత్తనాలు, ఎరువుల డీలర్లతో సాగుకు ఏర్పాట్లు, పంటమార్పిడి విధానాలపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున వర్షాభావ పరిస్థితులను తట్టుకునే ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. ఎరువుల బ్లాక్ మార్కెటింగ్, కృత్రిమ కొరతను అరికట్టేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రైతుల కోసం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ గణేష్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, వ్యవసాయశాఖాధికారి విజయనిర్మల, సంబంధిత శాఖల అధికారులు, మండలాల స్పెషల్ అధికారులు, తహసీల్దారులు, ఎరువుల డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.
సర్వే పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్
నక్ష టౌన్ సర్వే, ఎంజాయ్‌మెంట్ సర్వే, నాన్ కడాస్ట్రల్ సర్వే అమలు, పురోగతిపై హైదరాబాద్ నుంచి సీసీఎల్‌ఏ సెక్రటరీ లోకేష్‌కుమార్, సర్వే, సెటిట్‌మెంట్ అండ్ ల్యాండ్ రికార్ట్స్ కమిషనర్ రాజీవ్ హనుమంతు శుక్రవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎంపిక చేసి 70 గ్రామాల్లో ఎంజాయ్‌మెంట్ సర్వే పురోగతి, ఆయా గ్రామాల్లో రీసర్వే చేపట్టేందుకు అవసరమైన గెజిట్ ప్రచురణ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి సర్వే పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను వారు ఆదేశించారు. నక్ష టౌన్ సర్వే అమలులో నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో చేరుకుని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించి పనులను వేగవంతం చేయాలని సూచించారు. వీసీలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్ట్స్ ఎం.శ్రీనువాసులు, అధికారులు పాల్గొన్నారు.


