సంఘాల్లోని స్టాక్‌ కొనుగోలు | - | Sakshi
Sakshi News home page

సంఘాల్లోని స్టాక్‌ కొనుగోలు

Jun 20 2026 12:36 PM | Updated on Jun 20 2026 12:36 PM

కాశిబుగ్గ: చేనేత సంఘాల్లో నిల్వ ఉన్న చేనేత ఉత్పత్తుల ఖరీదు చేయాలని, నేతన్నలకు పెరిగిన వేతనాలు కూడా చెల్లించాలంటూ చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో టెస్కో అధికారులు ఉమ్మడి జిల్లాలోని చేనేత సంఘాల్లో నిల్వ ఉన్న లక్ష కార్పెట్లు, 38వేల బెడ్‌షీట్లను ఖరీదు చేశారు. వరంగల్‌ కొత్తవాడకు చెందిన చేనేత కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం వారం రోజులపాటు రిలే నిరాహారదీక్షలు చేసిన విషయం తెలిసిందే. చేనేత కార్మికుల దీక్షా శిబిరాన్ని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ సందర్శించి డిమాండ్లను తెలుసుకుని, వారం రోజుల్లోపు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తాజాగా మంత్రి కొండా సురేఖ హామీ నెరవేరడంతో పలు సంఘాల నాయకులు, చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కదిలొచ్చిన చేనేత జౌళిశాఖ, టెస్కో అధికారులు

సంఘాల్లో నిల్వ ఉన్న కార్పెట్లు, బెడ్‌షీట్లు ఖరీదు చేయడంతోపాటు మళ్లీ 2 లక్షల చొప్పున కార్పెట్లు, బెడ్‌షీట్లు కొనుగోలుకు ఇండెంట్‌ ఇవ్వాలని చేనేత జౌళిశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌ సర్క్యులర్‌ జారీ చేశారు. అలాగే, పెరిగిన 30 శాతం వేతనాలను మార్చి 31నుంచి అమలు చేయాలని ఆదేశించారు. దీంతో స్థానిక టెస్కో టెక్నికల్‌ సిబ్బంది శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని చేనేత సంఘాలను సందర్శించి చాలాకాలం నుంచి నిల్వ ఉన్న స్టాక్‌ను కొనుగోలు చేశారు. దాదాపు రూ.3 కోట్ల 20 లక్షల విలువ గల లక్ష కార్పెట్లు, రూ.కోటి 30లక్షల విలువ గల 38వేల బెడ్‌షీట్లను టెస్కో అధికారులు కొనుగోలు చేశారు.

మాట నిలబెట్టుకున్న మంత్రి సురేఖ

చేనేత కార్మికులకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి కొండా సురేఖ మాట నిలబెట్టుకున్నారని టీపీసీసీ చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చిప్ప వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. అలాగే చేనేత ఉత్పత్తులను కేంద్రీకృత టెండర్‌ విధానంనుంచి టెస్కో ద్వారానే కొనుగోళ్లు చేయించాలని కోరారు.

లక్ష కార్పెట్లు, 38వేల బెడ్‌షీట్ల ఖరీదు

నెరవేరిన మంత్రి కొండా సురేఖ హామీ

చేనేత నాయకులు, కార్మికుల హర్షం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement