సాక్షి, వరంగల్: ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సౌర విద్యుత్ వినియోగించే దిశగా అడుగులు పడుతున్నాయి. లక్షలాది క్వింటాళ్ల పంట సరుకులు ఈ మార్కెట్‌కు వస్తాయి. కార్యాలయాలు, మిర్చి యార్డులు, కాటన్ యార్డులు, అపరాల యార్డుల్లో వాడే విద్యుత్‌తో పాటు లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌ను కలిపితే ప్రతి నెలా రూ.మూడు లక్షలకు పైగా వస్తున్న విద్యుత్ బిల్లు కొంతమేర ఆదా అయ్యే అవకాశం ఉంది. ఆరు నెలల నుంచే గ్రిడ్ ఆధారిత సోలార్ పవర్ ప్లాంట్లను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై ఇప్పటికే సంబంధిత అధికారులు సర్వే పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దీన్ని ఆధారంగా చేసుకొని 90 కిలోవాట్ల సామర్థ్యంతో గ్రిడ్ ఆధారిత రూఫ్‌టాప్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు రూ.47,73,000 అదనపు బడ్జెట్ కేటాయించారు. రాష్ట్రంలోని నిజామాబాద్, గద్వాల, సూర్యాపేటతో పాటు వరంగల్ ఏనుమాములలోని పెద్ద వ్యవసాయ మార్కెట్లలోనే సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసిన తర్వాతే మిగిలిన మార్కెట్లు, రైతుబజార్లలోను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఏనుమాములలో జూన్ నెలాఖరునాటికి పూర్తి చేయనున్న సోలార్ ప్యానళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో బిల్లు ఆదా కానుంది. రోజుకు 450 నుంచి 550 యూనిట్ల చొప్పున నెలకు 13,500 యూనిట్లు నుంచి 16,200 యూనిట్లు ఉత్పత్తి కానుంది. అంటే దాదాపు రూ.లక్ష వరకు కరెంట్ బిల్లు తగ్గనుంది. ఈ ట్రయల్ రన్ విజయవంతమైతే మార్కెట్‌లోని ఇతర కార్యాలయాలు, యార్డులు, లక్ష్మీపురం కూరగాయాల మార్కెట్, పండ్ల మార్కెట్, జాయింట్ డైరెక్టర్ కార్యాలయాల్లోనూ ఈ సౌర ప్లాంట్లు ఏర్పాటు చేస్తే కరెంట్ బిల్లు పూర్తిస్థాయిలో ఆదా కానుంది. అంటే నెలకు రూ.మూడు లక్షల బిల్లు వచ్చినా ఏడాదికి రూ.36 లక్షల బిల్లు అయినా మొత్తానికి ఈ సౌర విద్యుత్ ద్వారా ఏడాదికి రూ.పది లక్షల వరకు బిల్లు ఆదా కానుంది.
రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన నాలుగు మార్కెట్లలో మనకు స్థానం
త్వరలోనే పనులు, జూన్ నెలాఖరు వరకు ఉత్పత్తి ప్రారంభం
తర్వాత జిల్లాలోని మిగిలిన మార్కెట్లు, రైతుబజార్లలో ప్లాంట్లు
తగ్గనున్న విద్యుత్ బిల్లుల భారం..
సమకూరనున్న అదనపు ఆదాయం
కరెంట్ బిల్లు ఆదా అవుతుంది..
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గ్రిడ్ ఆధారిత సౌర విద్యుత్ ప్లాంట్ల ద్వారా కరెంట్ బిల్లు ఆదా అవుతుంది. టెండర్లు పిలిచి సాధ్యమైనంత తొందరగా ఈ పనులు జూన్ నెలాఖరు వరకు పూర్తి చేసేలా చూస్తాం. దీనిద్వారా కరెంట్ బిల్లు ఆదా అవుతుంది.
–మల్లేశం, వరంగల్ ఏనుమాముల
వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి
విద్యుత్ ఉత్పత్తి ఎలా అంటే..
రోజుకు ఒక కిలో వాట్ : ఐదు యూనిట్ల
నుంచి ఆరుకుపైగా యూనిట్లు
రోజుకు 90 కిలోవాట్ : 13,500 యూనిట్ల నుంచి 16,200 యూనిట్లు
సంవత్సరానికి ఒక కిలోవాట్ : 1,800 యూనిట్ల నుంచి 2,160 యూనిట్లు
సంవత్సరానికి 90 కిలోవాట్ : 1,62,000 యూనిట్ల నుంచి 1,94,400 యూనిట్లు
సంవత్సరానికి వచ్చే ఆదాయం : రూ.9,72,000 నుంచి రూ.11,66,400


